Pre Diabetes Prevention Tips In Telugu : ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. కారణాలేవైనా, దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒకసారి మధుమేహం వచ్చిన తరువాత పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వాస్తవానికి ఇది ఒక్కసారి వచ్చిందంటే అదుపులో ఉంచుకోవడం తప్ప.. పూర్తిగా తగ్గించుకోవడం కష్టం. పైగా దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే డయాబెటిస్ రాకముందే జాగ్రత్త పడాలి. ప్రీ డయాబెటిస్ గురించి తెలుసుకోవడం వల్ల ఇది సాధ్యపడుతుంది. ఇంతకీ ఈ ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి ? దీన్ని ఎలా గుర్తించాలి ? ఆ విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి?
What Is Prediabetes : రక్తంలో చక్కెర స్థాయిలు ఒక పరిమితి కంటే మించి పెరిగితే దానిని డయాబెటిస్ అంటారు. అయితే రక్తంలో ఇంకా చక్కెర స్థాయిలు పెరుగుతూ, మధుమేహం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉంటే.. దానినే ప్రీ డయాబెటిస్ అంటారు. ఈ దశలో సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోయినా, వ్యాయామం చేయకపోయినా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఉన్నవారిలో.. దాదాపు 70 శాతం మంది మధుమేహం బారిన పడుతున్నారు. అందుకే.. దీన్ని ముందుగా గుర్తించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఇందుకోసం కచ్చితంగా జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇండియాలో మరింత ఎక్కువగా..
ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఉన్నవారి సంఖ్య మన దేశంలో ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్యలోని యువత దీని బారిన పడుతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఉబకాయం లాంటి సమస్యలే ఇందుకు ప్రధాన కారణం. ప్రీ డయాబెటిస్ ఉన్న వ్యక్తులను 3 రకాలుగా విభజించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు 100 - 120, మధ్యాహ్నం భోజనం చేసిన 2 గంటల తర్వాత పరీక్షించినప్పుడు షుగర్ లెవల్స్ 140 - 200, హెచ్‌బీఏ 1 సీ 5.7 - 6.5 మధ్య ఉంటే ప్రీ డయాబెటిస్ ఉన్నట్లు భావించవచ్చు. అయితీ ఈ స్టేజ్‌లోనే మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా.. డయాబెటిస్ వ్యాధి బారిన పడకుండా అడ్డుకోవచ్చు.
వ్యాధి లక్షణాలు గుర్తించడం ఎలా?
శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ తగినంతగా ఉత్పత్తి కాకపోతే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనినే డయాబెటిస్ అంటారు. అయితే ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఏమీ ముందుగా ప్రత్యేకంగా కనిపించవు. కేవలం డెయాబెటిస్ పరీక్షల్లోనే ప్రీ డయాబెటిస్ లక్షణాలు తెలుస్తాయి. అందుకే వంశపారంపర్యంగా మధుమేహం వ్యాధిన పడతున్నవారు.. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఒక వేళ ప్రీ డయాబెటిస్ లక్షణాలు బయటపడితే.. కచ్చితంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామాలు చేయాలి.
ఆహార నియమాలు
ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడంలో భాగంగా.. తినే ఆహారంలో తృణధాన్యాలు, తాజా కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజులో మూడు సార్లు కాకుండా.. కనీసం అయిదు సార్లు కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవాలి. ఒకే సారి ఎక్కువగా తినటం కంటే ఎక్కువ సార్లు తక్కువగా తినాలి. దీని వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. దీనితో పాటు భోజనానికి ముందు, తర్వాత సరిపడా నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. కనీసం ఒక రోజులో 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఎందుకంటే నీటి వల్ల ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది.
ఈ పదార్థాలకు దూరంగా ఉండండి!
Prediabetes Foods To Avoid : బాాగా ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్ తినకూడదు. వాస్తవానికి ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు బాగా పెరుగుతుంది. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. స్మోకింగ్ వల్ల కూడా నేరుగా డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. కనుక ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నవారు.. కచ్చితంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకి కనీసం 30 నిమిషాలు నడవటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల ప్రీ డయాబెటిస్ సమస్య అదుపులో ఉంటుంది.
ప్రీ డయాబెటిస్ సమస్య నుంచి బయట పడాలంటే ఆహారం తీసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం, మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉండకూడదు. వీలైనంత వరకు కృత్రిమ (కూల్ డ్రింక్స్) పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే బేకరీ ఉత్పత్తులకు కూడా సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అప్పుడే డయాబెటిస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండగలుగుతారు.