ఆసుపత్రుల్లో చేరే కోవిడ్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. వారిలో చాలా మంది సులభంగానే కోలుకుని ఇంటికి వచ్చేస్తున్నారు. కొందరు ఇంటి దగ్గరే కరోనాను జయిస్తున్నారు. ఏ విధంగా కరోనా కోరల నుంచి బయటపడినా.. తరువాత రోజుల్లో బలహీనత, నిస్సత్తువ, పగలంతా నిద్ర వచ్చినట్టు ఉండటం మొదలైన లక్షణాలతో బాధపడుతున్నారు.
- కరోనా అనంతర బలహీనత:
అన్ని వైరస్ జబ్బుల్లో కొంత బలహీనత ఉండటం సహజం. కొవిడ్ వైరస్ శక్తివంతమైనది కావడం వల్ల చాలా రోజుల పాటు.. దీని దుష్ప్రభావాలు కొనసాగుతాయి.
- ఔషధాల ప్రభావం:
కొవిడ్ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించిన రోగుల్లో శక్తివంతమైన యాంటి బయాటిక్స్, యాంటి వైరల్ ఔషధాలు, స్టెరాయిడ్ల వినియోగం వల్ల ఈ దుష్ప్రభావాలు కలుగవచ్చు.
- ఆకలి తగ్గటం:
చికిత్స అందించే సమయంలో రోగి ఎక్కువ ఆహారం తీసుకోలేరు. రుచిని కోల్పోవడంతో ఆకలి కూడా తగ్గుతుంది. కోలుకున్న తరువాత తిరిగి యథాస్తితికి చేరుకోవడానికి 4-6 వారాల సమయం పడుతుంది.
- ఇతర ఆరోగ్య సమస్యలు:
కొన్ని సార్లు కొంత మందిలో మధుమేహం వల్ల చక్కెర స్థాయి అనూహ్యంగా పెరిగి ఇన్సులిన్ వాడకం అవసరం పడవచ్చు. కాలేయ సమస్యలున్నా ఇటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు.
- అలసిన శరీరం:
శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే రోగనిరోధక వ్యవస్థ సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతుంది. తద్వారా శరీరం కోలుకోవడానికి విశ్రాంతి సమయం అవసరం.
- మానసిక ఆరోగ్యం..
మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. వైరస్ ప్రవేశించగానే మనసులో భీతి, ఆందోళన కలగటం సహజం. మన చుట్టూ ఉన్న ఆవరణ కూడా ప్రతికూలంగా కనిపిస్తుంది. చనిపోతున్న రోగుల సంఖ్య భయపెడుతుంది. ఇవన్నీ బలహీనతకు కారణాలే.
ఎలా అధిగమించాలి:
రెండు వారాలకు మించి కోవిడ్ దుష్ప్రభావాలు కొనసాగితే కింద సూచించిన మెళకువలతో సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి.
- కోవిడ్ అనంతరం స్వస్థత చేకూరిన వారికి సంతోషపరచే ఉల్లాసవంతమైన వాతావరణాన్ని ఏర్పరచాలి. వైద్యుడు వారిని చూడగానే “మీకు పూర్తిగా బాగయింది, ఇక బెంగ లేదు” అంటూ వారికి ధైర్యాన్ని కలిగించాలి.
- జబ్బు నుంచి కోలుకున్న తరువాత మాంసకృత్తులు (ప్రోటీన్లు) ఎక్కువగా ఉన్న ఆహారాన్ని, తాము సహజంగా తీసుకునే ఆహారాన్ని తీసుకోవాలి. పాలు, పన్నీరు, ఎండుఫలాలు (డ్రై ఫ్రూట్స్), వారి ఆరోగ్య స్థితిని అనుసరించి విటమిన్లు, జింక్ సప్లిమెంట్లను కొంత కాలం పాటు ఇవ్వాలి.
- శారీరక వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ఊపిరితిత్తులకు వ్యాయామాన్ని కలిగించే పరికరాలు, ప్రాణాయామ మొదలైనవి శ్వాసకోశాల సామర్ధ్యాన్ని బాగా పెంచుతాయి.
- కొంత కాలం పాటు వార్తా పత్రికలు చదవటం, వార్తా ఛానెళ్లను చూడటం ఆపండి. సామాజిక మాధ్యమాల నుంచి కూడా దూరంగా ఉండండి. వీటికి బదులుగా టీ.వీ లో సినిమాలు, సీరియల్స్ చూడటం లేదా పుస్తకాలు చదవుకోవటం అలవర్చుకోవాలి. వారికి బాధ కలిగించే విషయాలు మాట్లాడకుండా ఉండాలి.