అసలే క్యాన్సర్. ఆపై చికిత్స దుష్ప్రభావాలు. ఇలాంటి సమయంలో ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే నీటి శాతం తగ్గటం (డీహైడ్రేషన్) తీవ్రమైన సమస్య. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగానూ మారొచ్చు. క్యాన్సర్ చికిత్స తీసుకునేటప్పుడు వాంతులు, విరేచనాలు కావటం.. వీటికి తోడు ఇన్‌ఫెక్షన్లు, తీవ్ర జ్వరం, రక్తస్రావం, తగినన్ని ద్రవాలు తీసుకోలేకపోవటం వంటివన్నీ నీటి శాతం తగ్గటానికి (డీహైడ్రేషన్) దారితీస్తుంటాయి. దీని గురించి తెలుసుకోవటం మంచిది.
- వేళ్లతో చర్మాన్ని పట్టుకొని కాస్త పైకి లాగితే అలాగే నిలబడుతోందనుకోండి. ఒంట్లో నీటి శాతం తగ్గిందనే అర్థం. నోరు ఎండిపోవటం, చర్మం వదులుగా, ముడతలు పడినట్టు కావటం, లాలాజలం వంటి స్రావాలు చిక్కగా అవటం, మూత్రం సరిగా రాకపోవటం, వచ్చినా ముదురు రంగులో ఉండటం, తలనొప్పి, తలతిప్పటం వంటివన్నీ డీహైడ్రేషన్ లక్షణాలే.
- ఎంత నీరు పోతోందని తెలుసుకోవటం కాస్త కష్టమే. ఎన్నిసార్లు విరేచనానికి వెళ్లారు? ఎన్నిసార్లు వాంతులయ్యాయి? అనేది గుర్తు పెట్టుకుంటే కొంతవరకు పసిగట్టొచ్ఛు ఎంత నీరు తాగుతున్నారనేది చూసుకోవటమూ ముఖ్యమే. బాటిల్‌లో గానీ కప్‌లో గానీ ఒక మోతాదులో నీటిని తీసుకొని తాగుతుంటే ఎంత వరకు ద్రవాలు తీసుకుంటున్నారనేది తేలికగా చూసుకోవచ్చు.
- నోట్లో చిన్న ఐస్ ముక్కను వేసుకొని చప్పరించటమూ మేలు చేస్తుంది. దీంతో కొంతవరకు నీటిని భర్తీ చేసుకోవచ్చు.
- ఒకేసారి పెద్దమొత్తంలో నీటిని తాగటం కన్నా అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా తాగటం మంచిది. నీరే కాదు.. పండ్ల రసాల వంటివి మీకు ఇష్టమైన ద్రవాలు ఏవైనా తీసుకోవచ్ఛు కాకపోతే కెఫీన్‌తో కూడిన ద్రవాలు, మద్యం జోలికి వెళ్లొద్ధు ఇవి ఒంట్లో నీటిశాతం మరింత తగ్గేలా చేస్తాయి.
- ద్రవాలను తీసుకోవటం కష్టమైపోతున్నా, లక్షణాలు అదుపులోకి రాకపోతున్నా, జ్వరం 100.4 డిగ్రీల ఫారన్‌హీట్ కన్నా ఎక్కువగా ఉంటున్నా, నిద్ర అతిగా ముంచుకొస్తున్నా, తికమక పడుతున్నట్టు అనిపిస్తున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
ఇదీ చూడండి: చైల్డ్‌లైన్‌లో చిన్నారుల 'నిశ్శబ్ద' వేదన