paralysis attack in young age: వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పక్షవాతం వస్తోంది. ఎందుకు వస్తుందో అంతుచిక్కక యువత ఆందోళనకు గురవుతోంది. చిన్న వయసులోనే పక్షవాతం రావడానికి ప్రధానంగా జీవనశైలిలో మార్పే కారణమని వైద్యులు చెబుతున్నారు. వారంలో కనీసం ఐదు రోజులు కూడా వ్యాయామం చేయడం లేదు. దానికి తోడూ మద్యం అలవాటు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు లాంటి వాటితో పక్షవాతం తొందరగా వస్తుందని న్యూరో ఫిజిషియన్ అనిరుధ్‌రావ్ దేశ్‌ముఖ్ పేర్కొంటున్నారు.
చిన్నతనంలోనే ఎందుకు వస్తుంది: యువతలో కూడా వ్యాయామం చేయడం తగ్గిపోయింది. ఇంట్లోనే ఉద్యోగం చేయడం, ఇంట్లో కాకుండా బయటి నుంచి ఆహారం తెప్పించుకుని తినడం అలవాటయ్యింది. చిన్నతనంలోనే మధుమేహం బారిన పడటంతో ఇంకా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బ్రెయిన్‌స్ట్రోక్ వస్తున్న యువత సంఖ్య ఇటీవల పెరిగిపోతోంది.
పక్షవాతంలో తేడా ఉంటుందా: వృద్ధులు, యువతలో వచ్చే పక్షవాతంలో తేడా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ అంటేనే మెదడులో రక్తం గడ్డ కట్టడంతో మెదడు దెబ్బతింటుంది. లక్షణాలు ఇద్దరికి సమానంగా ఉంటాయి. చిన్నవాళ్లలో లక్షణాలు సీరియస్‌గా కనిపిస్తాయి. వీళ్లలో రికవరీ కూడా ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్లలోని మెదడులో స్పందనలు మెల్లగా ఉండటంతో చికిత్స ఆలస్యం అవుతుంది. ఫలితాలు కూడా నెమ్మదిగా వస్తాయి.
చికిత్స ఎలా ఉంటుంది: యువతలో మధుమేహం, అధిక రక్తపోటు ఉంటే చికిత్స ఒకేవిధంగా ఉంటుంది. జెనెటిక్స్ సమస్యలతో రక్తం చిక్కగా ఉండటంతో చికిత్సలో తేడాలుంటాయి. ఇటువంటి వారికి మందులు దీర్ఘకాలంగానీ జీవితాంతం వరకు వాడాల్సి రావచ్చు.
మళ్లీ మళ్లీ పక్షవాతం రావచ్చా: బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చినపుడు కొన్ని పరీక్షలు చేస్తాం. పక్షవాతం రావడానికి గల కారణాలను విశ్లేషించాలి. దానికి తగినట్టు చికిత్స చేయాలి. రక్తం చిక్కగా ఉండటం, జెనెటిక్స్ సమస్య ఉంటే సుదీర్ఘకాలం మందులు వాడకతప్పదు. ఆహారంలో మార్పు చేసుకోకపోతే మళ్లీ మళ్లీ ప్రమాదం బారిన పడొచ్చు.
నివారణ ఎలా: చిన్న వయసులో పక్షవాతం రావద్దంటే ముందుగా కుటుంబ చరిత్ర తెలుసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా మధుమేహం, అధిక రక్తపోటు,బ్రెయిన్‌స్ట్రోక్, గుండెపోటు వచ్చనవారుంటే అందరూ కూడా తరచుగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వ్యాయామం పెంచాలి.
ప్రథమ చికిత్స ఎలా: పక్షవాతం అంటే ఒకవైపు కాళ్లు, చేతులు, తల పని చేయకపోవడమని అందరికీ తెలుసు కానీ ఉన్నట్టుండి పడిపోవడం, తల తిరగడం, మతిమరుపు, మూతి వంకర పోవడమంటే పక్షవాతం వచ్చినట్టే. ఇలాంటి వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. బ్లడ్‌క్లాట్ అయితే 4,5 గంటల్లో రోగిని తీసుకొస్తే రక్తం గడ్డకట్టకుండా ఇంజక్షన్ ఇవ్వడానికి వీలవుతుంది. వెంటనే రక్త సరఫరా సాధారణంగా మారుతుంది. ఆలస్యం అయితే సమస్య తీవ్రత పెరుగుతుంది.