Night Shift Food Habits: కాలంతో పాటే కొలువులూ, పని వేళలూ మారాయి. చాలా రంగాల్లో ఉద్యోగులు ఇప్పుడు షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు. రాత్రి వేళల్లో పనిచేసేవారికి కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. పగటి సమయంలో ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల వారి దినచర్య మారిపోతోంది. ఇలాంటివారు అనివార్యంగానో, అలవాటుగానో రాత్రి వేళల్లో ఆహార పదార్థాలు, చిరుతిళ్లు తింటున్నారు. కాలక్రమంలో వీరు స్థూలకాయం, మధుమేహం, హృద్రోగాల బారిన పడుతున్నారు. ఈ అంశాలపై అమెరికాలోని నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌హెచ్‌ఎల్‌బీఐ) శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు.
ఆరోగ్యవంతులైన ఏడుగురు మహిళలు, 12 మంది పురుషులకు నెల రోజుల పాటు వివిధ సమయాల్లో ఆహారం ఇచ్చి చూశారు. జీవనశైలి మారడం కారణంగా ఆ మార్పులు వారి జీవగడియారంపై ప్రభావం చూపాయి. రాత్రి వేళల్లో ఆహారం తీసుకున్నవారిలో గ్లూకోజ్ స్థాయిలు అధికమైనట్టు గుర్తించారు.
"పని వేళలు ఏవైనాసరే.. పగటి పూట తినడమే శ్రేయస్కరం. ముఖ్యంగా రాత్రి విధులు నిర్వర్తించేవారు దీన్ని గుర్తుంచుకోవాలి. తద్వారా అధిక బరువు, మధుమేహం, హృద్రోగం వంటి రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు"అని పరిశోధనకర్త మరిష్కా బ్రౌన్ చెప్పారు. ఈ విషయమై మరింత లోతైన పరిశోధన సాగిస్తామన్నారు.