cancer treatment: క్యాన్సర్ వచ్చిందంటే చావే శరణ్యమని చాలా మంది భావిస్తారు. కానీ ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా రకాల క్యాన్సర్లకు ఉత్తమ చికిత్స అందిస్తున్నారు. కొన్నిసార్లు లక్షణాలు గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే తప్పా ప్రాణాలు పోవని వైద్యులు పేర్కొంటున్నారు. క్యాన్సర్‌పై ప్రజల అపోహలు, వ్యాధి నివారణకున్న మార్గాలను ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేశ్ కోట వివరించారు.
అవగాహన ఎందుకు తగ్గిపోతోంది..!
క్యాన్సర్‌తో మరణమనేది ప్రజలకున్న అపోహ మాత్రమే. వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయట పడొచ్చు. చాలా మంది నిర్లక్ష్యం చేయడంతో క్యాన్సర్ ముదిరిపోయి ప్రాణాంతకంగా మారుతుంది. తొలి దశలో వ్యాధిని గుర్తిస్తే నయం చేయడం పెద్ద సమస్య కాదు. చాలా మంది అంటువ్యాధిగా భావిస్తారు. ఇది నిజం కాదు. కేవలం గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్‌తో వైరస్ విస్తరిస్తుంది. హెపటైటీస్ బి, సీ వైరస్‌లతో కాలేయం క్యాన్సర్ వస్తుంది. ఇందులోనూ క్యాన్సర్ కాకుండా వైరస్‌లే ఇతరులకు విస్తరిస్తాయి. నూటికి 5-10 శాతం క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి. బయాప్సీ చేయకపోతే క్యాన్సర్‌ను గుర్తించడం కుదరదు.
చికిత్స ఇబ్బందికరంగా ఉంటుందా..?
క్యాన్సర్ అనగానే భయంతో వణికిపోతారు. కీమోథెరపీ, రేడియోథెరపీ వైద్య విధానాలతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అనుకుంటారు. అది నిజం కాదు. ఇప్పుడు తక్కువ కోతతో, తొందరగా కోలుకునేలా చికిత్స జరుగుతోంది. జుట్టు ఊడిపోవడం, ఆకలి మందగించడం, బలహీనంగా మారిపోతారనే అనుమానం అవసరం లేదు. మంచి మందులు చాలా అందుబాటులో ఉన్నాయి.
ఇవీ చదవండి: మడమ నొప్పి వేధిస్తోందా?.. ఈ ఆయుర్వేద చికిత్సతో సమస్య మటుమాయం!