కంటి జబ్బులకూ గుండెజబ్బుకు, పక్షవాతానికి సంబంధం ఉందా? అవుననే అంటోంది న్యూయార్క్ ఐ అండ్ ఇయర్ ఇన్ఫర్మరీ ఆఫ్ మౌంట్ సినానీ అధ్యయనం. వృద్ధాప్యంలో కొందరికి కంట్లో రెటీనా మధ్యభాగం (మాక్యులా) క్షీణిస్తుంటుంది. దీన్నే ఏజ్ రిలేటెడ్ మాక్యులా డీజెనరేజన్ (ఏఎండీ) అంటారు. దీని మూలంగా ఎంతోమంది చూపు కోల్పోతుంటారు. మాక్యులా క్షీణతలో రెండు రకాలున్నాయి. వీటిల్లో ఒకటి డ్రుసెన్ రకం. ఇందులో రెటీనా కింది పొరలో సన్నటి పసుపురంగు కొలెస్ట్రాల్ ముద్దలు ఏర్పడతాయి. దాంతో రెటీనాకు రక్తం, ఆక్సిజన్ అందటం తగ్గుతుంది. ఇది క్రమంగా చూపు పోవటానికి దారితీస్తుంది. విటమిన్ మాత్రలతో కొలెస్ట్రాల్ పోగు పడకుండా నివారించుకోవచ్చు.
మరో రకం సమస్య సబ్‌రెటీనల్ డ్రుసెనాయిడ్ డిపాజిట్స్ (ఎస్‌డీడీ). ఇందులో మరింత లోతుల్లో రెటీనా కణాల అడుగున ఉండే పొరలో కొవ్వు ముద్దలు ఏర్పడతాయి. దీన్ని గుర్తించటానికి అధునాతన స్కానింగ్ పరీక్షలు అవసరం. ప్రస్తుతానికి దీనికి చికిత్సలేవీ అందుబాటులో లేవు. ఏఎండీకీ గుండెజబ్బుకూ సంబంధం ఉంటున్నట్టు చాలాకాలంగా అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి సమగ్రమైన వివరాలేవీ లేవు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ఏఎండీకీ గుండెజబ్బుకూ సంబంధం ఉంటున్నట్టు తొలిసారిగా గుర్తించింది.
'గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిది'..
అధునాతన ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ పరీక్ష సాయంతో రెటీనా జబ్బు తీరుతెన్నులను పరిశోధకులు పరిశీలించారు. డ్రుసెన్‌తో బాధపడుతున్నవారిలో కన్నా ఎస్‌డీడీ గలవారిలో మూడు రెట్లు ఎక్కువగా గుండెజబ్బు లేదా పక్షవాతం తలెత్తినట్టు గుర్తించారు. అప్పటికే రక్తనాళాల సమస్య ఉన్నట్టు ఎస్‌డీడీ సూచిస్తోందని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే ఎవరిలోనైనా ఏఎండీని గుర్తిస్తే గుండె పరీక్షలూ చేయించుకోవటం మంచిదని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: మీ పిల్లల్ని తరచూ తలనొప్పి వేధిస్తుందా.. చెక్ పెట్టేయండిలా..