ETV Bharat / sukhibhava

మధుమేహుల పాలిట అమృత హస్తం ఇన్సులిన్ - diabetes problems

టైప్‌-1 మధుమేహానికైనా, నియంత్రణలో లేని టైప్‌-2 మధుమేహానికైనా సమర్థమైన విరుగుడు ఒక్కటే. అదే ఇన్సులిన్‌. మధుమేహ చికిత్సను మేలి మలుపు తిప్పిన అతి గొప్ప ఆవిష్కరణ ఇది. మధుమేహం నిర్ధరణ అయిన కొద్ది నెలల్లోనే ఎంతోమంది చిన్నారులు మృత్యువాత పడుతున్న తరుణంలో సంజీవనిలా పుట్టుకొచ్చి ఎంతోమంది ప్రాణాలను నిలిపింది. ఆవిష్కరించిన తొలినాళ్లలోనే అన్నిదేశాలకూ విస్తరించి ప్రపంచవ్యాప్తంగా మధుమేహుల పాలిట అమృత హస్తమైంది. ఇన్సులిన్‌ను కనుగొని వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

insulin history
ఇన్సులిన్​ సమస్యలు
author img

By

Published : Aug 10, 2021, 11:13 AM IST

ఇన్సులిన్‌ హార్మోన్‌ విశిష్టమైంది. దీనికి సాటి మరోటి లేదు. రక్తంలోని గ్లూకోజు కణాల్లోకి ప్రవేశించటానికి మార్గం సుగమం చేసేది ఇదే. ఇన్సులిన్‌ తగినంత ఉత్పత్తి కాకపోయినా, సమర్థంగా పనిచేయకపోయినా రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరిగిపోతాయి. మధుమేహానికి మూలం ఇదే. ఒకసారి మధుమేహం మొదలైందంటే నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి చేయగలిగిందేమీ లేదు. అదుపు తప్పితే కళ్ల నుంచి కాళ్ల వరకూ అన్ని అవయవాలనూ దెబ్బతీస్తుంది. శరీరాన్ని శక్తి విహీనం చేసి త్వరగా మృత్యువాత పడేలా చేస్తుంది. ఇన్సులిన్‌ను కృత్రిమంగా తయారుచేసేంతవరకు పరిస్థితి ఇలాగే ఉండేది. దీనికి సరైన చికిత్సంటూ ఉండేది కాదు. అప్పట్లో మధుమేహానికి ప్రధానమైన చికిత్స పిండి పదార్థాలు బాగా తగ్గించటమే. ఇది కొంతకాలం ప్రాణాలు నిలిపేది కానీ మనిషిని కాపాడలేకపోయేది. కఠినమైన పథ్యాల మూలంగా పోషణలేమితోనూ ఎంతోమంది మరణిస్తుండేవారు. ఇన్సులిన్‌ రాకతో ఈ పరిస్థితి మారిపోయింది.

ప్రత్యేకతలు ఎన్నెన్నో..

ఇన్సులిన్‌ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. మన శరీరంలో శక్తిని పొదుపు చేసే గుణాలు (అనబాలిక్‌) ఎక్కువగా గల హార్మోన్‌ ఇదొక్కటే. ఒక్క శక్తినే కాదు.. నీటిని, లవణాలనూ పొదుపు చేస్తుంది. శరీర శక్తి అవసరాలకు సరిపోయేలా కాలేయం, కండరాలు, కొవ్వు కణాల్లో గ్లూకోజును, ప్రొటీన్‌ను, కొవ్వులను నిల్వ చేస్తుంది. ఇన్సులిన్‌ సమపాళ్లలో ఉండటం చాలా అవసరం. దీని లోపంతోనే టైప్‌1 మధుమేహం తలెత్తుతుంది. అలాగని ఎక్కువైనా కష్టమే. గుండెజబ్బుల వంటి సాంక్రమికేతర జబ్బులకు మూలమైన వాపు ప్రక్రియకు (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రధాన కారణం ఇన్సులిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండటమే.

శరీరంలో ఏదైనా మందుకు నిరోధకత తలెత్తితే.. అంటే స్పందించకపోతే దాన్ని ఆపెయ్యాలి, దానికి బదులు వేరే మందు ఇవ్వాలి. ఇది వైద్య చికిత్స సూత్రం. కానీ ఇన్సులిన్‌ దీనికి మినహాయింపు. కణాలు ఇన్సులిన్‌కు స్పందించకపోతున్నా బయటి నుంచి ఇవ్వటం తప్పించి, మరో ప్రత్యామ్నాయం లేదు. నిజానికి టైప్‌2 మధుమేహుల్లో ఇన్సులిన్‌ తయారవుతూనే ఉంటుంది. ఆ మాటకొస్తే ఇంకాస్త ఎక్కువగానూ ఉంటుంది. సాధారణంగా ఇన్సులిన్‌ రక్తంలో 15 మైక్రోయూనిట్లు ఉండాలి. మధుమేహుల్లో చాలామందిలో 100 కన్నా మించి పోతుంది. అయినా కూడా ప్రయోజనం లేదు. వీరి కణాల్లో ఇన్సులిన్‌కు స్పందించే గ్రాహకాలు మూసుకుపోతాయి మరి. గ్రాహకాల సంఖ్య, వీటి ఎంజైమ్‌ పనితీరూ తగ్గుతాయి. దీంతో ఇన్సులిన్‌ సరిగా పనిచేయదు (ఇన్సులిన్‌ నిరోధకత). అంటే ఇన్సులిన్‌ ఎక్కువగా ఉన్నా శరీర అవసరాలకు సరిపోదన్నమాట. దీన్నే సాపేక్ష ఇన్సులిన్‌ లోపం అంటారు. ఇక్కడే కృత్రిమ ఇన్సులిన్‌ వరంగా పరిణమిస్తోంది. దీన్ని బయటి నుంచి పెద్ద మొత్తంలో ఇవ్వటం మూలంగానే ఇన్సులిన్‌ బలంగా కణాల్లోకి చొచ్చుకెళ్లటం సాధ్యమవుతోంది. ఇన్సులిన్‌ గొప్పతనమేంటో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

మొదట్లో కుక్కల్లో..

hundred years of insulin history
ఇన్సులిన్‌ను కనుగొని నేటికి వందేళ్లు

ఇన్సులిన్‌ను మొదట్లో కుక్కల క్లోమగ్రంథి నుంచి సంగ్రహించారు. తర్వాత పందులు (పోర్సైన్‌), ఆవుల (బొవైన్‌) క్లోమగ్రంథిలోంచి తీయటం ఆరంభించారు. మనలో తయారయ్యే ఇన్సులిన్‌తో పోలిస్తే పోర్సైన్‌ ఇన్సులిన్‌లో ఒక అమైనో ఆమ్లం, బొవైన్‌ ఇన్సులిన్‌లో మూడు అమైనో ఆమ్లాల వ్యత్యాసం ఉంటుంది. వీటితో కొన్ని చిక్కులు తలెత్తుండటంతో హ్యూమన్‌ ఇన్సులిన్‌ను తయారు చేయటంపై దృష్టి సారించారు. జన్యుపరంగా మార్చిన ఇ-కొలై బ్యాక్టీరియా సాయంతో మానవ ఇన్సులిన్‌కు సమానమైన ఇన్సులిన్‌ను రూపొందించారు. బ్రెడ్డు తయారీలో వాడే ఈస్ట్‌ శిలీంధ్రాల కణాల్లో ఇన్సులిన్‌ జన్యువును ప్రవేశపెట్టి కూడా ఇన్సులిన్‌ను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా అందుబాటులో ఉన్నది ఇవే.

నిరంతర పరిశోధన

ఇన్సులిన్‌ మీద పరిశోధన ఈనాటిది కాదు. దీన్ని ఆవిష్కరించినప్పట్నుంచీ నిరంతరంగా సాగుతూనే వస్తోంది. అసలు క్లోమగ్రంథిని గుర్తించటానికి, దాని స్రావాన్ని గ్రహించటానికే 300 ఏళ్లు పట్టింది. అనంతరం దీనిలోని మలినాలను తొలగించి సురక్షితంగా మార్చటం దగ్గర్నుంచి ఎక్కువ సేపు పనిచేసేలా చేయటం, దుష్ప్రభావాలు తగ్గించేలా రూపొందించటం, అవసరాలకు తగ్గట్టుగా మార్చటం వరకూ అన్నీ మానవాళిని మధుమేహం కోరల నుంచి బయటపడటానికి తోడ్పడుతున్నవే.

తొలి ఇన్సులిన్‌

మధుమేహం, ప్రమేహం వంటి వాటి గురించి ప్రపంచంలోని అన్ని దేశాల వైద్య శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ చికిత్స గురించే ఎవరికీ అవగాహన లేదు. దీన్ని రూపొందించటం వెనక వందలాది ఏళ్ల కృషి దాగుంది. కుక్కల్లో క్లోమగ్రంథిని తొలగిస్తే వాటిల్లో మధుమేహ లక్షణాలు బయటపడుతున్నట్టు, అవి త్వరగా మరణిస్తున్నట్టు 1889లో గుర్తించటం కొత్త ఆలోచనకు దారితీసింది. క్లోమగ్రంథిలోంచి పుట్టుకొచ్చే పదార్థాలు మధుమేహ చికిత్సకు ఉపయోగపడగలవనే భావన పురుడు పోసుకుంది. మధుమేహుల క్లోమగ్రంథిలో ఒకే ఒక రసాయనం లోపిస్తున్నట్టు 1910లో గుర్తించారు. దీనికి ఇన్సులిన్‌ అని పేరు పెట్టారు. దీన్ని లాటిన్‌ పదం ఇన్సులా నుంచి తీసుకున్నారు. ఇన్సులా అంటే ఐలాండ్‌ అని అర్థం. అనంతరం 1921లో ఫ్రెడెరిక్‌ బాంటింగ్‌ అనే ఆర్థోపెడిక్‌ సర్జన్‌, అప్పటి వైద్య విద్యార్థి చార్లెస్‌ బెస్ట్‌ కలిసి కుక్కల క్లోమగ్రంథి స్రావం నుంచి ఇన్సులిన్‌ను వేరు చేయటంలో విజయం సాధించారు. దీన్ని మధుమేహం గల కుక్కకు ఇచ్చి, రక్తంలో గ్లూకోజు మోతాదులు తగ్గుతున్నట్టు నిరూపించారు. వైద్యరంగంలో ఇదో మేలి మలుపు. అత్యద్భుత ఆవిష్కరణ. మధుమేహుల ప్రాణాలు నిలబెట్టటానికి ఎంతగానో ఉపయోగపడింది. అప్పటివరకూ జబ్బు నిర్ధరణ అయిన కొద్ది నెలల్లోనే మరణించే పిల్లలు బతికి బట్ట కట్టేలా చేసింది. క్లోమగ్రంథి చాలా చిత్రమైంది. దీనిలో లైపేజ్‌, ఎమైలేజ్‌, ప్రొటియేజ్‌ అనే ఎంజైమ్‌లుంటాయి. ఇవి చాలా శక్తిమంతమైనవి. క్లోమగ్రంథికి మన చేయి తగిలితే వెంటనే దాన్ని కరిగించేస్తాయి. అందువల్ల దీన్ని బయటకు తీసి, పరిశోధనలు చేయటం అసాధ్యం. అయినా కూడా ఎంతో కష్టపడి క్లోమగ్రంథిలోని రహస్యాన్ని ఛేదించగలిగారు. దీని స్రావాలను నోటి ద్వారా ఇవ్వటం సాధ్యం కాదని, ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వాల్సి ఉంటుందనీ అప్పట్లోనే గుర్తించటం విశేషం. దీన్ని రక్తనాళం ద్వారా ఇస్తే 20 నిమిషాల్లోనే కరిగిపోతుంది. అందుకే చర్మం కిందే తీసుకోవాల్సి ఉంటుందనీ కనుగొన్నారు. మరో మంచి సంగతి- ఇన్సులిన్‌కు పేటెంట్‌ తీసుకోకపోవటం. దీంతో అనతికాలంలోనే అన్నిదేశాల్లోనూ ఉచితంగా తయారు చేసుకోవటానికి మార్గం సుగమమైంది. మనదేశంలోనూ వెంటనే ఇన్సులిన్‌ అందుబాటులోకి రావటం గమనార్హం.

తటస్థ ఇన్సులిన్‌

తొలి తరం ఇన్సులిన్‌ ముడి స్రావం రూపంలో ఉండేది. 2, 3 గంటలకు మించి పనిచేసేది కాదు. రోజూ 4-6 సార్లు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చేది. పైగా దీన్ని ఆమ్ల మాధ్యమంతో తయారుచేయటం వల్ల ఇంజెక్షన్‌ ఇచ్చిన చోట మంట పుట్టేది. చుట్టుపక్కల కణజాలం కరిగిపోయేది. ఇలాంటి బాధలు తప్పించటానికి ఆమ్ల, క్షార గుణాలేవీ లేని తటస్థ ఇన్సులిన్‌ను రూపొందించారు. అలాగే ఇచ్చిన రెండు, మూడు గంటల్లోనే ఇన్సులిన్‌ కరిగిపోకుండా ఉండటానికి ప్రొటమైన్‌ అనే చేప ప్రొటీన్‌ను జతచేసి ఎక్కువ కాలం పనిచేసేలా తీర్చిదిద్దారు. ప్రొటమైన్‌ రక్తంలో ఆలస్యంగా కరుగుతుంది కాబట్టి దీంతో ముడిపడిన ఇన్సులిన్‌ కూడా నెమ్మదిగా రక్తంలో కలుస్తుందన్నమాట. ప్రొటమైన్‌ మరో ప్రత్యేకత- ఇది మన రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించకపోవటం. అంటే దీనికి మన శరీరంలో ఎలాంటి యాంటీబాడీలు ఉత్పత్తి కావన్నమాట. ఇలా చివరికి 12 గంటల పాటు పనిచేసే ఎన్‌పీహెచ్‌ (న్యూట్రల్‌ ప్రొటమైన్‌ హేజ్‌డాన్‌) ఇన్సులిన్‌ అందుబాటులోకి వచ్చింది. దీనికి మరో 25 ఏళ్లు పట్టింది. ఇది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రోజుకు 2 ఇంజెక్షన్లు మాత్రమే తీసుకునేలా చేసింది.

మోనో కాంపోనెంట్‌ ఇన్సులిన్‌

క్లోమగ్రంథిలో ఇన్సులిన్‌తో పాటు గ్లూకోగాన్‌, పాలీపెప్టైడ్‌, సి పెప్టైడ్‌, కణాలను వృద్ధి చేసే ఐజీఎఫ్‌ (ఇన్సులిన్‌ లైక్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌) వంటి ఇతర పదార్థాలూ ఉంటాయి. ఇవీ రక్తంలో గ్లూకోజు నియంత్రణకు తోడ్పడతాయి గానీ కొన్ని సమస్యలకూ దారితీస్తాయి. వీటిన్నింటినీ తొలగించి, గ్లూకోజును మాత్రమే తగ్గించే ఇన్సులిన్‌ మాత్రమే మిగిలేలా మోనో కాంపోనెంట్‌ ఇన్సులిన్‌ను తయారుచేయటం మరో గొప్ప మలుపు. ఇందుకు మరో 25 ఏళ్లు పట్టింది.

డిజైనర్‌ ఇన్సులిన్లు

ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ మోతాదు ఎక్కువైతే రక్తంలో గ్లూకోజు బాగా పడిపోవచ్చు (హైపో గ్లైసీమియా). తక్కువైతే గ్లూకోజు నియంత్రణలో ఉండకపోవచ్చు. మాటిమాటికీ ఇంజెక్షన్లు తీసుకోవటమూ కష్టమే. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికే డిజైనర్‌ ఇన్సులిన్లు పుట్టుకొచ్చాయి. ఇవి 4, 6, 12 గంటలు.. ఇలా నిర్ణీత సమయం మేరకే పనిచేస్తాయి. ఆ తర్వాత కరిగిపోతాయి. ఇలాంటి షార్ట్‌, మీడియం, లాంగ్‌ యాక్టింగ్‌ రకాలను కావాల్సినట్టుగా మార్చి, అనలాగ్‌ రకం ఇన్సులిన్లనూ రూపొందించారు. వీటితో గ్లూకోజు మోతాదులు గణనీయంగా పడిపోవటం వంటి దుష్ప్రభావాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 24 గంటలు, 40 గంటలు పనిచేసే ఇన్సులిన్లూ వచ్చాయి.

ఇదీ చదవండి:ఆ మందుతో కొవిడ్‌కు కళ్లెం వేయొచ్చు!

ఆకుకూరలు తినండి.. కండరాల బలం పెంచుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.