How to Stop Bad Smell From Fridge : ఈ కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ గృహోపకరణాల్లో ముఖ్యమైన వాటిలో రిఫ్రిజరేటర్ ఒకటి. వాటర్ బాటిళ్ల నుంచి మొదలు.. తినే పదార్థాలు, కూరగాయలు వంటివి నిల్వ చేసుకునేందుకు దాదాపు అందరూ ఫ్రిజ్‌ను విరివిగా ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఫ్రిజ్ డోర్ తెరిచిన వెంటనే ఘాటైన వాసన, కొన్ని సార్లు దుర్వాసన రావడం మీరు గమనించే ఉంటారు. మరి దీనికి గల కారణాలేంటి అంటే.. అందులో మోతాదుకు మించి పదార్థాలు పెట్టడం. అన్ని రకాల పదార్థాలతో ఫ్రిజ్‌ను నింపడం. ముఖ్యంగా కట్ చేసిన చేపలు, మాంసం, కూరగాయలు పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను నివారించాలంటే కొన్ని చిట్కాలున్నాయి. వాటిని పాటిస్తే... దీన్నుంచి బయట పడచ్చు. అవేంటంటే..
1. బేకింగ్ సోడా
మీ రిఫ్రిజిరేటర్‌లో ఒక పాత్రలో బేకింగ్ సోడా పోసి ఓపెన్‌గానే ఉంచండి. బేకింగ్ సోడా వాసనలను గ్రహించే గుణాన్ని కలిగి ఉండడం వల్ల అది దుర్వాసననంతా పీల్చుకుని ఫ్రిజ్‌ను తాజాగా ఉంచుతుంది. ప్రతి 1 నుంచి 3 నెలలకు ఒకసారి ఆ బాక్స్‌ను మార్చండి.
2. యాక్టివేటెడ్ చార్ కోల్
బేకింగ్ సోడాలాగే యాక్టివేటెడ్ చార్ కోల్ (బొగ్గు) సైతం వాసనలను సమర్థంగా గ్రహించే స్వభావముంది. ఫ్రిజ్‌లో ఒక గిన్నెలో యాక్టివేటెడ్ చార్ కోల్‌ను ఉంచడం వల్ల అది అందులోని వాసనల్ని పీల్చుకుంటుంది. ఫలితంగా దుర్వాసన సమస్య తీరిపోతుంది.
3. సిట్రస్ జాతి పండ్లు
చెడు వాసన సమస్యల్ని పరిష్కరించడంలో సిట్రస్ జాతి పండ్లు బాగా పనిచేస్తాయి. నిమ్మకాయ లేదా నారింజను సగానికి కట్ చేసి.. వాటిని షెల్ఫ్‌లో గానీ కంటైనర్‌లో గానీ ఉంచండి. ఇవి సహజమైన, ఆహ్లాదకరమైన సువాసనల్ని కలిగి ఉంటాయి. అందువల్ల దుర్వాసనల్ని అరికట్టడంలో సాయపడతాయి.
4. కాఫీ విత్తనాలు
కాఫీ విత్తనాలకూ చెడు వాసనను గ్రహించే సామర్థ్యముంది. ఎండిన కాఫీ విత్తనాల్ని ఒక గిన్నెలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. అందువల్ల ఇవి ఆ దుర్వాసనను గ్రహించి ఫ్రిజ్ లోపలి గాలిని శుభ్రపరుస్తాయి.
5. వెనిగర్
ఒక చిన్న గిన్నెలో తెల్ల వెనిగర్‌ను నింపి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. వెనిగర్‌కు ఘాటైన, తడి వాసనల్ని తొలగించే శక్తి ఉండడం వల్ల చెడు వాసన దరిచేరదు.
6. సిట్రస్ జాతి పండ్ల తొక్కలు
సిట్రస్ జాతికి చెందిన నారింజ పండ్ల లాంటి తొక్కల్ని ఫ్రీజ్ చేయాలి. తర్వాత వాటిని గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో పరచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి సువాసనను వెదజల్లుతాయి.
7. నీట్‌గా ఉంచుకోవడం
మీ ఫ్రిజ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఎక్స్పైర్ అయిన ఆహార పదార్థాలు, ఇతరత్రావి అందులో నుంచి తీసేయండి. ఆహార పదార్థాలు, కూరగాయలు ఒక క్రమ పద్ధతిలో పేర్చడం వల్ల.. అవి ఒకదానితో మరొకటి కలిసిపోయి కలుషితం కాకుండా ఉంటాయి.
ఏసీ, ఫ్రిజ్, ఇంటర్నెట్.. తెగ వాడేస్తున్న భారతీయులు!
టీవీ స్క్రీన్ క్లీన్ చేస్తున్నారా? అయితే ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి!