వేపుళ్లు...
వీటిలో కెలొరీలు ఎక్కువ. ఈ వంటకాల్లోని నూనె పొట్టలోకి వెళ్లి కొవ్వుగా మారుతుంది. ఇది కరిగిపోవడం చాలా కష్టమైన ప్రక్రియ. దాంతో ఊబకాయం, మధుమేహం, మరికొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వేపుళ్లకు దూరంగా ఉండాలి.
చక్కెర ద్రవాలకూ... మనం తాగే సోడా, శీతల పానీయాలు, మార్కెట్లో దొరికే పండ్లరసాల్లో పెద్ద మొత్తంలో చక్కెర ఉంటుంది. అలాగే బిస్కట్లు, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లలో కూడా. వీటి నుంచి తక్కువ కెలొరీలు లభిస్తాయి. అయితే చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తం, హర్మోన్లపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది పొట్టకే కాదు కాలేయంలోనూ కొవ్వులు జమ కావడానికి కారణమవుతుంది. ఇది అనారోగ్యానికి సంకేతం. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
ఉప్పు...
పొట్ట పెరగడానికి ఉప్పు ఎక్కువగా తినడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. అలా అని అవసరానికంటే ఎక్కువ నీళ్లు తాగితే అది సమస్యే కదా. ఇది మీ బరువులో మార్పు తెస్తుంది.
మరి ఏం చేయాలంటే... వేపుళ్లకు బదులుగా కూరగాయలను ఉడికించి తీసుకోవాలి. లేదా అవెన్‌లో ఉడికించాలి. స్వీట్ తినాలనిపించినప్పుడు బెర్రీ, మామిడి లాంటి పండ్లను తినాలి. టీ కాఫీలకు బదులుగా కూరగాయలు, పండ్ల రసాలను తాగాలి. చిప్స్, వడియాలు, అప్పడాలు కాకుండా ఎండుఫలాలు, గింజలు, ప్రూట్ క్యాండీలను తింటే సరి.
ఇవి తినండి!
యాపిల్...
రోజూ ఓ యాపిల్ తింటే మీ పొట్ట తగ్గుతుంది తెలుసా... ఈ పండులో ఆరోగ్యకరమైన పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అధిక కొవ్వులను కరిగిస్తుంది.
పెరుగు...
ప్రొటీన్‌భరిత పెరుగు పొట్టలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దీంట్లోని అధిక ప్రొటీన్ జీవక్రియలను మెరుగు పరుస్తుంది. ఇవి అధిక కెలొరీలను కరిగించడంతో పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.
చిరుధాన్యాలు...
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించడంలో చిరుధాన్యాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ముతకబియ్యం, గోధుమలు, ఓట్స్, క్వినోవా, రాగులు, సామలు, జొన్నలు... వీటన్నింటినీ ఆహారంలో చేర్చుకోండి మరి.