థైరాయిడ్ గ్రంథి.. మానవ శరీరంలో మెడ దిగువన ముందు భాగంలో ఉంటుంది. ఆ గ్రంథి విడుదల చేసే హర్మోన్లు జీవక్రియను నియంత్రణలో ఉంచుతాయి. ఇవి అతిగా లేదా అత్యల్పంగా విడుదలైతే... థైరాయిడ్ వ్యాధి బారినపడతారు. హైపర్-థైరాయిడిజం (థైరాయిడ్ గ్రంథి పెరగడం) లేదా హైపో-థైరాయిడిజం (థైరాయిడ్ గ్రంథి క్షీణించడం) వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో.. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచించారు.
హైపర్ థైరాయిడిజం లక్షణాలు..
థైరాయిడ్ గ్రంథి పెరిగినప్పడు... ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం, భయం, చంచలత్వం, చిరాకు, అధికంగా చెమటలు పట్టడం, చర్మం పలచబడటం, బరువు తగ్గడం, నీరసం వంటి లక్షణాలు బయటపడతాయి.
హైపో థైరాయిడిజం లక్షణాలు
థైరాయిడ్ గ్రంథి క్షీణించినప్పుడు... ఆయాసం, నీరసం, చర్మం, జుట్టు పొడిబారటం, బరువు పెరగడం, గుండె కొట్టుకొనే వేగం నెమ్మదించడం, మలబద్ధకం, తీవ్ర ఒత్తిడికి లోనవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
"ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధి ఉంటే రోగనిరోధకత తగ్గుతుందా? అని చాలా మంది అడుగుతున్నారు. అలా జరగదని మేము నిర్ధరించగలం. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ పరిస్థితులకు కారణమయ్యే రోగనిరోధక వ్యవస్థ... కొవిడ్-19 వంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ వేరుగా ఉంటాయి.' -బ్రిటీష్ థైరాయిడ్ ఫౌండేషన్
థైరాయిడ్ సమస్యల కోసం తీసుకునే ఔషధాలు రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపవు లేదా బలహీనపరచవు అని థైరాయిడ్ ఫౌండేషన్ వైద్యులు చెప్పారు. అయితే కంటి వ్యాధితో బాధపడుతున్న కొంతమందిలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని, అధిక మోతాదు స్టెరాయిడ్ వాడితే దుష్ప్రభావాలు ఉంటాయని స్పష్టం చేశారు.
కొవిడ్-19 కాలంలో థైరాయిడ్‌తో బాధపడుతున్నవారికి నిపుణులు సూచనలు..
⦁ ధ్యానం, యోగా చేయాలి. వీటి ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. ముఖ్యంగా గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.
⦁ ఎత్తుకు తగ్గ బరువు ఉండేట్లు చూసుకోవాలి. శరీరానికి తగినంత పోషకాహారం అందించాలి. మీరు ఇంట్లో ఉన్నప్పడు అతిగా తినకపోవడం మంచిది.
⦁ నిర్లక్ష్యం చేయకుండా థైరాయిడ్ ఔషధాలు వైద్యులు చెప్పిన విధంగా క్రమం తప్పకుండా వేసుకోవాలి. బయటకు వెళ్లే అవసరం రాకుండా... మందులు నిల్వ ఉంచుకోవాలి.
⦁ మద్యపానం సేవించకపోవడం మంచిది. ఒకవేళ సేవించినట్లయితే థైరాయిడ్ ఔషధాలు తీవ్ర ప్రభావం చూపుతాయి.
⦁ అలసట, ఆయాసం, నీరసం వంటి లక్షణాలు కనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.
⦁ ఆరోగ్యకరమైన శరీరం, మనసు ప్రశాంతత కోసం రోజూ వ్యాయామం చేయాలి.
⦁ థైరాయిడ్ ఉన్నవారికి కరోనా వల్ల ఎక్కువ ప్రమాదం లేదని అజాగ్రత్తగా ఉండవద్దు. ఆరోగ్య,ప్రభుత్వ అధికారులు సిఫార్సు చేసినట్లుగా ప్రజలు సరైన జాగ్రత్తలు నివారణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం.