ఈమధ్య నాకో విచిత్ర సమస్య ఎదురైంది. సమావేశమైనా, డెస్క్‌లో అయినా తెలియకుండానే నిద్ర పోతున్నా. ఇదే పని ఎవరైనా చేస్తే అన్‌ప్రొఫెషనల్ అనుకునే దాన్ని. ఇప్పుడు నేనే అలా చేస్తున్నా. వారంలో మూడు సార్లు ఇలా జరిగింది. అసలు నాకేం అవుతోంది?
నేషనల్ స్లీప్ ఫౌండేషన్ సర్వే ప్రకారం.. ఒక్క అమెరికాలోనే మూడింట ఒక వంతు ఉద్యోగులు ఆఫీసులో నిద్ర వస్తోందని చెప్పారు. నిద్రలేమి కారణంగా ఉత్పాదకతా తగ్గుతోందట. రాత్రి సరిగా నిద్రపోకపోవడం, ఎక్కువ గంటల పని.. ఇలా కొన్నిసార్లు ఈ అలసటకు కారణమేంటో కచ్చితంగా చెప్పొచ్చు. కానీ వేరేవీ కారణమవొచ్చు. ఒక పరిశోధన ప్రకారం మధ్యాహ్నం నిద్ర రావడం సహజమే. కాకపోతే పనిలో రావడమే ఇబ్బంది. తమ అలసట, విశ్రాంతి స్థాయులను గ్రహించడంలో చాలా మంది విఫలం అవుతుంటారు. ఇదే సమస్య.
నిద్ర సరిగా పోని పిల్లల్ని చూడండి. సరిగా తినరు, ఆడుకోరు, చికాకు పడతుంటారు. అదే ఉద్యోగి విషయానికొస్తే తోటి వారిపై అరవడం, సరిగా పని చేయలేక పోవడం లాంటివి చేస్తుంటారు. తప్పులు చేసే ప్రమాదమూ ఉంది. కాబట్టి, నిద్ర సమయానికే కాదు.. నాణ్యతకీ ప్రాధాన్యమివ్వాలి. దీన్ని మెరుగుపరుచుకోవడానికి...
- ఉదయం వ్యాయామాన్ని అలవాటు చేసుకోండి. ఇది రోజంతా చురుకుగా ఉంచుతుంది. వీలైతే మధ్యాహ్నమూ నాలుగు అడుగులు వేయండి.
- తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, చేపలు, మాంసం, గుడ్లు, పాలు వంటి బి విటమిన్లు ఎక్కువగా, తక్కువ కొవ్వు- ప్రొటీన్లతో కూడిన ఆహారాన్ని తినాలని స్లీప్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
- ఒకేరకమైన పని కూడా విసుగునిస్తుంది. ఆసక్తికరంగా, ఛాలెంజింగ్‌గా అనిపించకపోతే బాస్‌తో మాట్లాడి టాస్క్‌లను మార్చమనండి. పని సమయంలో నిద్ర ఎక్కడో సమస్య ఉందన్న దానికి సూచనా అయ్యుండొచ్చు. ఇది ఎంతోమంది ఎదుగుదలలో పెద్ద సమస్యగా పరిణమించింది. కాబట్టి, దీన్ని త్వరగా, జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి.