How To Control Bad Cholesterol : శరీరంలో ఉండే ఒకరకమైన కొవ్వు పదార్థం కొలెస్ట్రాల్. అన్ని జీవుల మాదిరిగానే మనకూ ఇది అవసరం. కాబట్టి శరీరం మనం తినే ఆహారం నుంచి ఈ పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. ఆహారం నుంచే కాకుండా రోజువారీ ఉత్పత్తయ్యే మొత్తం కొలెస్ట్రాల్‌లో సుమారు 20 నుంచి 25 శాతం వరకు కాలేయంలో తయారవుతుంది. పేగులు, ఎడ్రినలిన్ గ్రంథి, పునరుత్పత్తి అవయవాల్లో కూడా కొవ్వు ఉత్పత్తవుతుంది. కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు రెండు రకాలు ఉంటాయి. ఇది అధికంగా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి దీనిని ఎలా అదుపులో పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలోని కొవ్వు వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ అని చెప్పారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.లక్ష్మీ కాంత్. అందుకే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన వివరించారు. "ప్రధానంగా మనం తినే ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు తీసుకోవాలి. ఇందులోనూ అవి మంచి కార్బోహైడ్రేట్లు అయి ఉండాలి. ప్రోటీన్లు, సహజమైన పీచు పదార్థాలు తీసుకోవాలి. వీలైనంత వరకు కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి" అని తెలిపారు.
"ఆల్కహాల్ వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. బరువు అదుపులో ఉండేందుకు రోజూ వ్యాయామం చేయాలి. లేందటే మీకు ఇష్టమైన ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా చేసుకోవచ్చు. ఈ కాలంలో తినే ఆహార పదార్థాల ప్యాకింగ్పైన లేబుల్స్ ఉంటున్నాయి. అందులో ప్రోటిన్, ఫైబర్, ఇతర పోషకాలు ఎంత శాతంలో ఉంటాయో తెలుస్తుంది. వాటిని గమనించి తీసుకోవాలి. స్నాక్స్, జంక్ ఫుడ్ అయితే, అందులో ఎన్ని క్యాలరీలున్నాయో చూసి తీసుకోవడం ఉత్తమం."
--డా.లక్ష్మీ కాంత్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
మంచి కొవ్వు పెంచుకోండి!
"జీవన శైలిలో పలు మార్పులు చేసుకోవడం ద్వారా కూడా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. నడక, సైక్లింగ్, ఈత లాంటి తేలికపాటి వ్యాయామలు చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పాటు అధిక బరువు సమస్య దరి చేరదు. అంతేకాకుండా రక్త నాళాల్లో వాపు తగ్గి వాటి గోడలు మందం కాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించుకోవడానికి కొన్ని ఆహార పదార్థాల్ని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి. మంచి కొలెస్ట్రాల్ కోసం ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్ ఎక్కువగా తీసుకోవాలి. ఆపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది" అని వైద్యులు తెలిపారు.
"ఒత్తిడి, నిద్రలేమి వల్ల కూడా క్యాలరీలు పెరిగే అవకాశముంది. ఈ కాలంలో యువత రాత్రిళ్లు పనిచేయడం వల్ల ఆ సమయంలోనూ ఆహారం తీసుకుంటున్నారు. దీని వల్ల కూడా బరువు పెరుగుతారు. తక్కువ సమయంలోనే అధిక బరువు పెరిగే అవకాశముంది. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం, పనివేళల్లో మార్పులు చేసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ బారి నుంచి బయట పడవచ్చు. ఇవే కాకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కూడా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు."
--డా.లక్ష్మీ కాంత్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
30 ఏళ్లు దాటాక ఇలా
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను సమతుల్యం చేసుకోవడానికి రోజులో తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినటం అలవాటు చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. శాచ్యురేటెడ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. 30 ఏళ్ల వయసు దాటిన వారు శరీరంలో కొవ్వు పెరగకుండా ఉండేందుకు తృణ ధాన్యాలతో చేసే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. బ్రౌన్ రైస్, బ్రెడ్, ఆరెంజ్, కాన్ బెర్రీ లాంటి పండ్లను డైలీ డైట్లో చేర్చుకోవాలన్నారు. వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటూనే, కొవ్వు తీసిన పాలు తాగవచ్చని చెప్పారు. ఎప్పుడూ ఒకే రకం వంట నూనెలు కాకుండా, వాటిని మారుస్తూ ఉండాలని వివరించారు.