కొన్ని కొన్ని విషయాలు మనకు బాగానే తెలుసు. అయినా పెద్దగా పట్టించుకోం. ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటాం. నీళ్లు తాగటానికి సంబంధించిన సూత్రాలు అలాంటివే. నీళ్లు తాగటం చాలా అవసరం. వీటిని మరోసారి గుర్తుచేసుకుందాం.
- గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగటం మంచిది. మరీ చల్లగా ఉండే నీరు ఒంట్లోంచి ద్రవాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. జీర్ణక్రియ సైతం మందగిస్తుంది.
- రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగాలని చాలామంది చెబుతుంటారు. నిజానికి ఎన్ని నీళ్లు తాగాలనడానికి కచ్చితమైన కొలతలేవీ లేవు. కొన్నిసార్లు ఎక్కువ అవసరమవ్వచ్చు. కొన్నిసార్లు తక్కువ అవసరమవ్వచ్చు. వాతావరణం, చేస్తున్న పని వంటి వాటిని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. అయితే అతి పనికిరాదు. మరీ ఎక్కువగా గానీ మరీ తక్కువగా గానీ తాగటం తగదు.
- రోజును నీటితో ఆరంభించటం మంచిది. ఉదయాన్నే ఓ గ్లాసు నీరు తాగితే ఉత్సాహం వస్తుంది. ఇలా ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవచ్చు.
- భోజనం చేసేటప్పుడు కొద్దిగా నీళ్లు తాగితే ఇబ్బందేమీ లేదు గానీ మరీ ఎక్కువగా తాగకూడదు. ఇది జీర్ణరసాలను పలుచగా చేసి జీర్ణక్రియ మందగించేలా చేస్తుంది.
- టీ, కాఫీలు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. వీటిని తీసుకునేటప్పుడు కాస్త నీళ్లు తాగటం మేలు.