కరోనా ఉనికి చాటుకున్న తొలినాళ్లలో పాజిటివ్ వచ్చిన వారికి తప్పకుండా ఆసుపత్రిలోనే చికిత్స అందించేది ప్రభుత్వం. కేసుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందిపై ఒత్తిడి అధికమైంది. ఫలితంగా ప్రైవేటు ఆసుపత్రులు కూడా చికిత్స అందించే విధంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు కూడా బాధితులతో నిండిపోయాయి. అక్కడ కూడా పడకలు ఖాళీ లేవనే సమాధానం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్వల్ప లక్షణాలున్నవారు, ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌గా తేలిన వారికి ఇంట్లోనే చికిత్స చేయవచ్చని ప్రభుత్వం సూచించింది. భారత వైద్య పరిశోధన మండలి కూడా ఇందుకు తగ్గట్టుగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
స్వయంగా పరీక్షలు చేసుకునేలా శిక్షణ
ఇంట్లోనే చికిత్స తీసుకోవాలనుకునే వారికి పల్స్, రక్తపోటు, ఎస్‌పీవో2, బ్లడ్ షుగర్ వంటివి స్వయంగా పరీక్షించుకునేలా కొవిడ్ సెంటర్ ప్రతినిధులు, ఏఎన్‌ఎంల ద్వారా శిక్షణనిస్తారు. స్వీయ చికిత్సను ఏఎన్‌ఎం ఎప్పటికప్పుడు యాప్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. జిల్లాలోని టెలీకన్సల్టేషన్ కేంద్రాలకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి..? మనోస్థైర్యం ఎలా పొందాలి..? అనే అంశంపై వారు సూచనలు ఇస్తారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న వారిలో లక్షణాలు తీవ్రమైతే మెరుగైన వైద్యం కోసం వారిని వెంటనే కొవిడ్ ఆసుపత్రికి తరలిస్తారు. 28 రోజుల తర్వాత కరోనా నిర్ధారణ పరీక్ష చేస్తారు. నెగిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ పూర్తయినట్లు ప్రకటిస్తారు.
హోం ఐసోలేషన్ పాటిస్తే.. అన్నీ ఉచితం
ప్రభుత్వం సూచించిన హోం ఐసోలేషన్‌లో అన్ని ఉచితంగానే లభిస్తాయి. ఇక ప్రైవేటు ఆసుపత్రులు కూడా హోం ఐసోలేషన్‌ను సూచిస్తున్నాయి. కానీ ఇందుకు తగిన ఫీజు వసూలు చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకోవడం అన్నది స్వల్ప లక్షణాలు ఉన్నవారికి, అలాగే ఎలాంటి లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్నవారు మాత్రం ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడమే ఉత్తమం. ఇంట్లో ఉంటూ వైద్యులు అందించిన సూచనలు పాటిస్తూ కరోనా కోరల నుంచి బైటపడినవారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది ఉన్నారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంది.
మందులు అవసరం లేకుండానే
ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న వారు... కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుంది. కానీ వీరిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. ఆరోగ్యంగా ఉన్నవారు, 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు దీని గురించి ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు నిపుణులు. వీరికి ప్రత్యేకమైన మందులేవీ అవసరం లేదని సమయానికి పడుకోవడం, సరిగా భోజనం చేయడం, కంగారు పడకుండా ఉండడం వంటివి చేస్తే చాలని సూచిస్తున్నారు. వీరిలో అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, మూత్రపిండాలు, కాలేయం, మెదడు, తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు, 60 ఏళ్ల పైబడినవారుంటే.. వైద్యుల్ని సంప్రందించటం మేలు. వారి ఆరోగ్యం బాగానే ఉంది.. ఇంట్లోనే ఉండొచ్చని వైద్యులు ధ్రువీకరిస్తే వీరు హోం ఐసోలేషన్‌లో ఉండవచ్చు.
లక్షణాలు తక్కువే ఉన్నా.. వ్యాప్తికి అవకాశం ఎక్కువ
సాధారణంగా వైరస్ వచ్చిన తర్వాత ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కరోనాలో మాత్రం లక్షణాలు రాకముందు నుంచే వ్యాప్తికి అవకాశాలున్నాయి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు రావడానికి 2, 3 రోజుల ముందు నుంచి కూడా వీరి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. వీరిలో జ్వరం 101 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే తక్కువ ఉంటుందని.. అప్పుడప్పుడూ పొడి దగ్గు.. కొద్దిగా గొంతునొప్పి ఉండొచ్చని అంటున్నారు. వీరిలో ఆయాసం వంటి లక్షణాలు ఉండవు. ఇలాంటి వారు కూడా 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండటం ఉత్తమం. ఐసోలేషన్ పూర్తయిన తర్వాత మరో 7 రోజులు ఇంటినుంచి బయటకు రాకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఇంట్లో ఉండే వారు ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం విడి గదిలో ఉండాలి. వీరు ఎన్ 95 మాస్క్ ధరించనక్కర్లేదు. సర్జికల్ మాస్క్ ధరిస్తే చాలని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం గాలి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్న చెబుతుండటంవల్ల ఇంట్లో ఉండేవారు కూడా.. వీలైనంత మేరకు మాస్కులు ధరించడం మంచిది. లేదంటే గదిలో గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి.
పాటించాల్సిన ప్రధాన జాగ్రత్తలు
ఇంట్లో చికిత్స పొందుతున్న వారు ఎక్కువగా వేడి నీరు తగినంతగా తాగుతూ ఉండాలి. ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.. ఆరోగ్య కేంద్రంతో అనుసంధానమై ఉండాలని సూచిస్తున్నారు. కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. కొందరు తమలో లక్షణాలు లేక పోయినా కూడా కరోనా ఉందేమోనన్న అనుమానంతో పరీక్షల కోసం వరుసల్లో నిలబడుతున్నారు. ఆఫీసుల్లో, అపార్టుమెంటుల్లో ఒకరికి వస్తే.. అందులో పనిచేసేవారు, అక్కడుంటున్నవారు అందరూ పరీక్షించుకోవడానికి పరుగులు పెడుతున్నారు.
వాస్తవానికి జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలున్నవారు.. తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నవారు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గత 2 వారాల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించిన వ్యక్తికి దగ్గరగా మెలిగి, లక్షణాలు గుర్తించినా.. పాజిటివ్ వ్యక్తి కుటుంబంలో లక్షణాలు కనిపించకపోయినా.. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, మూత్రపిండాల జబ్బు.. తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులుంటే వారు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి : ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్