HDL cholesterol Uses: కొలెస్ట్రాల్ మొత్తం చెడ్డదేమీ కాదు. ఇందులో మనకు మేలు చేసే రకం కూడా ఉంటుంది. అదే హెచ్‌డీఎల్. దీనికి సంబంధించిన హెచ్‌డీఎల్3 రకం కొలెస్ట్రాల్ కాలేయం దెబ్బతినకుండా కాపాడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
HDL Cholesterol Good or Bad: సాధారణంగా హెచ్‌డీఎల్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను వెతికి పట్టుకొని, బయటకు పంపించటానికి వీలుగా కాలేయానికి చేరవేస్తుంది. పేగుల్లోంచి పుట్టుకొచ్చే ప్రత్యేకమైన హెచ్‌డీఎల్3 కొలెస్ట్రాల్ మరో గొప్ప పని కూడా చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇది పేగుల్లోని బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే వాపుప్రక్రియ సంకేతాలు కాలేయానికి చేరకుండా అడ్డుకుంటున్నట్టు కనుగొన్నారు. హెచ్‌డీఎల్3 అడ్డుకోకపోతే ఈ బ్యాక్టీరియా సంకేతాలు పేగుల నుంచి కాలేయానికి చేరుకుంటాయి. అక్కడి రోగనిరోధక కణాలను పురికొల్పి వాపు ప్రక్రియ స్థితిని ప్రేరేపిస్తాయి. ఇది చివరికి కాలేయం దెబ్బతినటానికి దారితీస్తుంది. హెచ్‌డీఎల్ మంచి కొలెస్ట్రాలే అయినా దీని మోతాదులను పెంచే మందులతో గుండెకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని కొన్ని ప్రయోగ పరీక్షల్లో తేలింది. అందుకే వీటి వాడకానికి అంతగా మొగ్గు చూపటం లేదు. నిజానికి గుండెజబ్బు మాదిరిగానే కాలేయ జబ్బు కూడా దీర్ఘకాలిక జబ్బే. ఇదీ తీవ్రమైందే. తాత్సారం చేస్తే ప్రాణాల మీదికీ రావొచ్చు. కాబట్టి హెచ్‌డీఎల్3 మోతాదులను పెంచుకోగలిగితే కాలేయానికి మేలు చేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఊబకాయంతో మరిన్ని జబ్బులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి