సాధారణంగా దురద అనేది ఇన్‌ఫెక్షన్‌కు సంకేతం. అది కాకుండా హార్మోన్లు సమతుల్యత కోల్పోయినప్పుడు, ఒక్కోసారి నెలసరికి ముందు లేదా చర్మ వ్యాధుల్లో ఇలా దురద వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలుపు అవుతుందో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో మొదట కనుక్కోవాలి. ఈ సమస్య మొదటిసారి వచ్చింది అంటున్నారు... ఈ వయసులో బ్లడ్ షుగర్స్ ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ముందుగా మీరు బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవాలి.
మీరోసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే... పరీక్ష చేసి క్యాండియాసిస్ లాంటి సమస్యలేమైనా ఉన్నాయా అని చూస్తారు. క్యాండియాసిస్, బ్యాక్టీరియల్ వెజైనిస్ ఉన్నప్పుడు ఇలా దురద పుట్టడం అనేది ఓ సూచన. ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ఇది భార్యాభర్తలిద్దరూ తీసుకోవాలి. ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తగ్గేవరకు లైంగిక చర్యకు దూరంగా ఉండటం లేదా కండోమ్ వాడటం చేయాలి.
ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తగ్గిన తర్వాత మరోసారి చెకప్ అవసరమవుతుంది. పాప్‌స్మియర్ పరీక్ష కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. తెలుపు అవుతుంటే దానిలో రంగు మార్పు పరీక్షించాలి. పసుపు రంగులో ఉంటే బ్యాక్టీరియల్ వెజైనిస్, పెరుగులా ఉండి దుర్వాసన వేస్తుంటే అది క్యాండియాసిస్ ఇన్‌ఫెక్షన్ కావొచ్చు. ఓరల్, వెజైనల్ మాత్రలు ఇస్తారు. ఈ మాత్రలను దంపతులిద్దరూ తప్పనిసరిగా వాడాలి.