Green Tea Bags Side Effects : ఆరోగ్యం కోసమంటూ ఈ రోజుల్లో చాలా మంది గ్రీన్ టీ తాగుతున్నారు. ఇందుకోసం ఇన్‌స్టంట్‌గా టీ బ్యాగులు ఉపయోగిస్తున్నారు. అయితే.. ఆరోగ్యానికి మంచిదని తాగుతున్న ఈ గ్రీన్ టీ బ్యాగులతో.. తీవ్ర అనర్థాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మైక్రోప్లాస్టిక్స్ : సాధారణంగా గ్రీన్ టీ బ్యాగ్‌లను నైలాన్, రేయాన్, పాలీప్రొఫైలిన్ పేపర్లతో తయారుచేస్తారు. అయితే ఇటీవలి పరిశోధనల ప్రకారం.. ఈ టీ బ్యాగ్‌లను వేడి నీటిలో నానబెట్టినప్పుడు.. అందులో ఉండే మైక్రోప్లాస్టిక్స్ టీలోకి వచ్చి చేరే ఛాన్స్ ఉందట. ఈ మైక్రోప్లాస్టిక్స్ నిండిన టీని తాగడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. ఒక గ్రీన్ టీ ప్లాస్టిక్ బ్యాగ్ 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్, 3.1 బిలియన్ నానోప్లాస్టిక్ కణాలను నీటిలోకి విడుదల చేసే ఛాన్స్ ఉందట.
అల్యూమినియం కంటెంట్ : కొన్ని టీ బ్యాగ్‌ల షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి కంపెనీలు అల్యూమినియం సమ్మేళనాలను ఉపయోగించి సీలు చేస్తాయి. అయితే.. దీర్ఘకాలిక అల్యూమినియం.. ఎక్స్పోజర్ న్యూరోటాక్సిసిటీని, అల్జీమర్స్ వంటి వ్యాధులను కలింగే అవకాశాలను పెంచుతుందట.
గ్రీన్ టీ తాగితే లివర్ ఫెయిల్.. ఆ మొక్కల్లో విష పదార్థాలు.. సంచలన పరిశోధన
క్యాన్సర్ కారకాలు : టీ బ్యాగ్ పేపర్లు వేడి నీటిలో తడిసినప్పుడు అవి చిరిగిపోకుండా బలంగా ఉండడానికి.. ఎపిక్లోరోహైడ్రిన్ అనే రసాయనాన్ని విపరీతంగా ఉపయోగిస్తారట. ఇది క్యాన్సర్‌ను కలిగించే కారకం. ఒకవేళ మీరు వినియోగించే గ్రీన్ టీ బ్యాగులో ఈ పదార్థాలు ఉంటే.. వాటిని వేడి నీటిలో ముంచి ఆ టీని తాగితే ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లేనని అంటున్నారు.
టీ ఆకుల నాణ్యత : గ్రీన్ టీ బ్యాగులన్నీ ఒకే విధమైనవని అనుకుంటే.. పొరపాటు పడ్డట్టే. ఇందులోను ఏ గ్రేడ్, బీ గ్రేడ్ అంటూ.. గ్రేడ్ల వారిగా ఉంటాయి. ఎక్కువ శాతం టీ బ్యాగ్‌లలో ఫ్యానింగ్, టీ డస్ట్ వంటి తక్కువ నాణ్యత కలిగిన ఆకులను ఉపయోగిస్తుంటారని సమాచారం. వీటిల్లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయట. ఇవి తక్కువ యాంటీఆక్సిడెంట్ కంటెంట్.. ఎక్కువ కెఫిన్ కంటెంట్‌కు దోహదం చేస్తాయట.
చివరగా.. గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ.. పలు ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి నాణ్యతలేని టీ బ్యాగ్‌లను అధికంగా వినియోగించకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ మీరు గ్రీన్ టీ బ్యాగ్‌లు ఉపయోగించాలనుకుంటే.. వాటి నాణ్యత గురించి పూర్తిగా తెలుసుకొన్న తర్వాతనే తీసుకోవాలి. నమ్మదగిన బ్రాండ్‌లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవకాశం ఉంటే.. బ్యాగులకు ప్రత్యామ్నాయంగా విడిగా దొరికే గ్రీన్ టీ ఆకులను ఉపయోగించడం మంచిదని అంటున్నారు.
గ్రీన్ టీ- తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారా?.. వేడిగా తీసుకుంటే నష్టమా?
Green Tea Vs Black Tea : గ్రీన్ టీ Vs బ్లాక్ టీ.. ఆరోగ్యం కోసం ఏది బెటర్ ఛాయిస్!