Good Parenting Tips in Telugu : పిల్లల పెంపకంలో ఒక్కొక్కరు ఒక్కో శైలితో వ్యవహరిస్తుంటారు. అయితే.. కఠినంగా వ్యవహరించినా, గాలికి వదిలేసినా అనర్థాలు తప్పవని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. వాళ్లను సరైన దారిలో నడిపించాల్సి ఉంటుంది. కానీ.. ఈ క్రమంలో తల్లిదండ్రులు తీసుకునే పలు చర్యల వల్ల పిల్లలు మానసికంగా ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే.. అదో అలవాటుగా మారుతుంది. అందుకే.. పిల్లలు నిత్యం నవ్వుతూ ఎదిగేలా చూడాలని చెబుతున్నారు. ఇందుకోసం పలు సూచనలు చేస్తున్నారు.
నిజాయితీని అభినందించాలి.. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు దానిని దాచడానికి అబద్ధాలు చెబుతుంటారు. పేరెంట్స్ కోపానికి భయపడి ఎక్కువ మంది ఇలా చేస్తారు. అయితే.. వాళ్లు చెప్పే చిన్నచిన్న అబద్ధాలను సరిచేయకపోతే.. పిల్లల్లో అబద్ధాలు చెప్పే ధోరణి పెరుగుతుంది. కాబట్టి చిన్నప్పుడే వారిలో ఈ గుణాన్ని నిర్మూలించాలి. ముఖ్యంగా నిజాయితీని అలవాటు చేయాలి. ఇందులో భాగంగా.. మీ బిడ్డ నిజం చెప్పినప్పుడు.. ప్రశంసించాలి. అబద్ధాలు చెప్పినప్పుడు.. వారికి నిజం విలువను తెలియజేయాలి.
మా ఆనందానికి కారణం నువ్వే అని చెప్పాలి.. మీ బిడ్డను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో వాళ్లు అర్థమయ్యేలా చెప్పాలి. మీ ప్రేమను పొందడానికి పిల్లలు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదని చెప్పండి. మీ ముందు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పండి. మేమంతా నిన్ను చాలా ప్రేమిస్తామని చెప్పండి. ఇలా చెప్పడం ద్వారా మీ బిడ్డకు కుటుంబంలో తనకు కూడా ప్రాముఖ్యత ఉందనే భావన కలుగుతుంది. అది లైఫ్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపుతుంది.
మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? ఇలాగైతే భవిష్యత్తు నాశనమే!
వారి సహనాన్ని మెచ్చుకోవాలి.. మీ పిల్లలు భోజనం ముగించి డిన్నర్ టేబుల్ వద్ద ఓపికగా కూర్చున్నందుకు అప్పుడు మీరు వాళ్లను కనీసంగానైనా మెచ్చుకోవాలి. సక్సెస్ కావడానికి.. సహనం కలిగి ఉండటం చాలా ముఖ్యం. అలాగే ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు.. చాలా ఓపిక అవసరం. ఈ విషయం పిల్లలకు తెలియదు. అందువల్ల.. ఓపిక చాలా గొప్పదని అభినందనతో చెప్పండి.
నిబద్ధతను పొగడాలి.. మీ పిల్లలు ప్రతి పనిలోనూ ఎక్స్‌పర్ట్స్ కాకపోవచ్చు. కానీ, వారు అదే పని చేస్తూ ఉంటే.. అందులో సక్సెస్ కావడానికి ప్రయత్నిస్తుంటే, అప్పుడు కచ్చితంగా మీరు వారి నిబద్ధతను ప్రశంసించాలి. అలాగే పిల్లలు సాధించే చిన్న విజయాలకు కూడా పేరెంట్స్‌గా మీరు ప్రశంసించాలి. అలా చేస్తే వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుంది.
మీ నవ్వు చాలా బాగుంది.. పిల్లలు డల్‌గా ఉండకూడదు. ఏదైనా కారణంతో వారు అలా ఉంటే.. వారి పక్కన కూర్చొని కారణం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా సమస్య ఉంటే.. పరిష్కారానికి మీరేం చేయగలరో అది చేయండి. ఆ తర్వాత.. సమస్యకు డల్ కావొద్దని చెప్పండి. ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉండాలని చెప్పండి. వారి చిరునవ్వు మీకు ఎంత విలువైనదో తెలియజేయండి. మీ నవ్వు చాలా బాగుంటుందని పొగడండి. కొన్నిసార్లు పొగడ్త చాలా పెద్ద పనులు కూడా చేయిస్తుంది. ఇవి పాటిస్తే.. పిల్లలు త్వరగా వాస్తవాలను అర్థం చేసుకొని నవ్వుతూ ఉంటారు.
మీ టీనేజ్ పిల్లల ప్రవర్తన భయపెడుతోందా? డోన్ట్ వర్రీ ఈ టిప్స్ పాటించండి!
Parenting tips: పిల్లలు అడిగిన వెంటనే ఇవ్వొద్దు.. ఎందుకంటే..