చిన్నప్పటి మాదిరిగా పెద్దయ్యాక పరుగెత్తటం, గెంతటం చేయలేం కదా. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా అంతే. నేర్చుకోవటం, గుర్తుపెట్టుకోవటం, సమస్యలను పరిష్కరించటం వంటివన్నీ వయసుతో పాటు నెమ్మదిస్తూ వస్తుంటాయి. వృద్ధాప్యంతో పాటు కొన్ని మెదడు సమస్యల ముప్పూ పెరుగుతుంటుంది. ఇవి మెదడు, దాని పనితీరు మీద ప్రభావం చూపుతాయి. అల్జీమర్స్, ఇతరత్రా డిమెన్షియా రకాల్లో ప్రొటీన్ల ముద్దలు పోగుపడి మెదడు కణజాలం దెబ్బతింటుంది. మధుమేహం, గుండెజబ్బులు, కొన్నిరకాల మందులు, చూపు తగ్గటం, చెవుడు, నిద్రలేమి, కుంగుబాటు వంటివీ మెదడు పనితీరును అస్తవ్యస్తం చేసి, విషయగ్రహణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. మధ్యవయసు దాటాక ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి మరచిపోవటం.. తర్వాత అవి గుర్తుకురావటం తరచూ చూసేదే. ఇది వయసుతో పాటు తలెత్తే మామూలు మతిమరుపా? డిమెన్షియాలాంటి మెదడు సమస్యలతో వచ్చే మతిమరుపా? అని చాలామంది సందేహిస్తుంటారు. ఇంతకీ ఎలాంటి లక్షణాలను మామూలుగా తీసుకోవాలి? వేటిని తీవ్రంగా పరిగణించాలి?
మామూలు మతిమరుపు
- మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఏవైనా పదాలు తట్టకపోవటం.
- మునుపటి కన్నా ఎక్కువ సమయం తీసుకున్నా ఎట్టకేలకు పనులు పూర్తి చేయటం.
- కారు, బండి తాళాలు ఎక్కడ పెట్టామో గుర్తుకురాకపోవటం.
- రణగొణధ్వనుల మధ్య ఇతరుల మాటలను ఒకింత శ్రద్ధ పెట్టి వింటుండటం.
- వాదించేటప్పుడు త్వరగా సంయమనం కోల్పోవటం.
- రోజు మాదిరిగా కాకుండా తరచూ ఇంటి తాళం చెవులు, కారు తాళం చెవులను వేరేచోట పెడుతుండటం.
- రాత్రి ఏం తిన్నామన్నది మరచిపోయినా ఎవరైనా చూచాయగా చెబితే గుర్తుకు రావటం.
- హోటళ్ల వంటి చోట్ల లోపలకు ఏ ద్వారం నుంచి వెళ్లాలనేది వెంటనే నిర్ణయించుకోలేకపోవటం.
- ఇంతకుముందు కన్నా తక్కువ వేగంతో వాహనాలు నడుపుతుండటం.
- ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఆలస్యంగా జవాబు ఇస్తుండటం.
తీవ్రమైన మతిమరుపు
- ఒక పదానికి బదులు పొంతనలేని మరో పదాన్ని వాడటం. (ఉదా: బీరువాకు బదులు బల్ల అనటం)
- ఉద్యోగ బాధ్యతలను నిర్వహించటంలో ఇబ్బంది పడటం. విధి విధానాల క్రమాన్ని పాటించలేకపోవటం.
- వాహనం ఎలా నడపాలన్నది మరవటం.
- రణగొణధ్వనుల వంటివి ఉన్నచోట్ల ఇతరులతో అసలే మాట్లాడలేకపోవటం.
- భర్త/భార్య మీద తరచూ అరవటం. అదీ అకారణంగా.
- తాళం చెవుల వంటి రోజూ వాడుకునే వస్తువులను అదే పనిగా పోగొట్టుకోవటం. తర్వాత అవి ఫ్రిజ్ వంటి అనూహ్యమైన చోట్ల బయటపడుతుండటం.
- రాత్రి ఏం తిన్నామన్నది అసలే గుర్తుండకపోవటం. ఎవరైనా చెప్పినా గుర్తు తెచ్చుకోలేకపోవటం.
- ఏం తినాలో, ఏం ధరించాలో నిర్ణయించుకోలేకపోవటం. రోజూవారీ నిర్ణయాలనూ తీసుకోలేకపోవటం.
- ముందు వెళ్లే వాహనాలకు అనుగుణంగా వెంటనే స్పందించలేకపోవటం. తరచూ ఎర్రలైటు పడ్డా గుర్తించలేక ముందుకు కదలటం.
- ఫోన్ మోగిన విషయాన్ని, మాట్లాడాల్సిన అవసరాన్ని గుర్తించలేకపోవటం.
ఇదీ చూడండి: పిల్లల్లోనూ పోస్ట్ కొవిడ్ లక్షణాలు!