కొత్త భాష నేర్చుకోవటం: ఎక్కువ భాషలు తెలిసినవారి మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. ఒక భాష మాట్లాడేవారితో పోలిస్తే రెండు భాషలు మాట్లాడేవారికి డిమెన్షియా ముప్పు తక్కువ. అందువల్ల ఏదైనా కొత్త భాష నేర్చుకోవటానికి ప్రయత్నించటం మంచిది. మేధాశక్తి పెరగటానికి బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం ఇతర భాషల పాటలో, మాటలో వినొచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ వేరే భాషలనూ నేర్చుకోవటానికి అవకాశముంది. ఇతర భాషలను నేర్చుకోవటానికి యాప్‌లూ అందుబాటులో ఉంటున్నాయి.
సంగీతం వినటం, సాధన చేయటం: భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి, శారీరక కదలికలకు తోడ్పడే వాటితో పాటు మెదడులోని అన్ని భాగాలనూ సంగీతం ఉత్తేజితం చేస్తుంది. అందువల్ల కొత్త తరహా సంగీతం వినటం, వీలైతే ఏదైనా వాయిద్యాన్ని వాయించటం నేర్చుకోవటం మంచిది. కావాలంటే యూట్యూబ్ వీడియోలతోనూ సంగీత సాధన చేయొచ్చు. వాయిద్యాలను వాయించటం నేర్చుకోవచ్చు.
బోర్డు ఆటలు: చదరంగం వంటి ఆటలు మెదడుకు పదును పెడతాయి. జ్ఞాపకాలను వెలికితీసే సామర్థ్యాన్ని పెంచుతాయి. వ్యూహాత్మకంగా ఆలోచించేలా చేస్తాయి. ఒక్క చదరంగమే కాదు.. పులి జూదం, అష్టా చెమ్మా వంటివీ మేలు చేస్తాయి. మోనోపలీ, చెకర్స్ వంటి బోర్డు గేమ్‌లూ ఉపయోగపడతాయి. బొమ్మలను, అంకెలను జోడించే కార్డు ఆటలు సైతం జ్ఞాపకశక్తి, ఊహాశక్తి, ఒక క్రమపద్ధతిలో ఆలోచించే నేర్పు పెరగటానికి దోహదం చేస్తాయి.
ప్రయాణాలు: కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త శబ్దాలను వినటం వల్ల మెదడులో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఆయా అనుభూతుల మూలంగా మెదడులో నాడీవ్యవస్థ పనితీరూ మారుతుంది. పరిస్థితులకు అనుగుణంగా స్పందించటమూ మెరుగవుతుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లటం కుదరకపోవచ్చు గానీ చట్టుపక్కల ప్రాంతాలను సందర్శించొచ్చు. ఇంతకుముందెన్నడూ చూడని పట్టణాలకు, పార్కులకు వెళ్లటం వంటివి చేయొచ్చు.
నాటకాలు, సినిమాలు చూడటం: సాంస్కృతిక కార్యక్రమాలు మెదడుకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. తేలికగా అర్థమయ్యే వాటికి బదులు కాస్త కష్టపడి అర్థం చేసుకోవాల్సిన నాటకాలో, సినిమాలో అయితే బుర్రకు ఇంకాస్త పదును పెడతాయి. సబ్‌టైటిల్స్ చూడకుండా ఆయా పాత్రలు మాట్లాడే మాటలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఒకింత సంక్లిష్టమైన సంగీత కచేరీకి వెళ్లినా మేలే. ఆన్‌లైన్‌లో ఏదైనా మ్యూజియంను చూస్తున్నట్టయితే కళాకారులు తాము చెప్పదలచుకున్న విషయం కోసం ఎంచుకున్న అంశాలను నిశితంగా పరిశీలించొచ్చు.
పజిల్స్ పరిష్కరించటం: పదకేళీలు, సుడోకు వంటివి ఏకాగ్రత, హేతుబద్ధత, జ్ఞాపకశక్తి వంటి సామర్థ్యాలు పెరగటానికి తోడ్పడతాయి. అందువల్ల వీలున్నప్పుడల్లా వీటిని సాధన చేయటం మంచిది. రోజూ ఒకేరకం పజిల్స్ కాకుండా మార్చి మార్చి పరిష్కరించటం అలవాటు చేసుకోవాలి. అంటే ఒకరోజు సుడోకు ముందేసుకుంటే మరో రోజు పదకేళీలు పూరించటం సాధన చేయాలి. కాస్త కఠినమైన పజిల్స్ అయితే మెదడు మరింత పదును తేలుతుంది.
ఇదీ చూడండి: Health tip: వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోండి.. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి!