ప్రపంచవ్యాప్తంగా కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో చాలా మంది మద్యం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే తాజా అధ్యయనం ప్రకారం అధికంగా మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే లక్షలాది మందికి సోకిన కరోనా వైరస్‌కు ఎటువంటి వ్యాక్సిన్ లేదు కనుక తప్పనిసరిగా మద్యానికి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.
తీసుకున్న మోతాదును బట్టి..
మన శరీరంపై ఆల్కహాల్ చూపే ప్రభావం గురించి వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఒక రోజులో తక్కువ మద్యం సేవిస్తే.. ప్రభావం స్వల్పంగా ఉంటుందని.. అదే అధిక మోతాదులో తీసుకుంటే రోగ నిరోధక శక్తితో పాటు ఇతర శరీర అవయవాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.
తాగిన 5 గంటల తర్వాత...
ఎక్కువగా మద్యం తీసుకున్న 20 నిమిషాల తర్వాత రోగనిరోధక శక్తి పెరిగినట్లు అనిపించినా.. మత్తు ఎక్కిన 2 నుంచి 5 గంటల తర్వాత.. క్రమంగా శక్తి తగ్గిపోతుందని ఓ మీడియా సంస్థ నివేదికలో వెల్లడించింది. మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తికి అత్యవసరమైన తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం, రోగనిరోధక శక్తి తగ్గించే ప్రొటీన్ల పెరుగుదలను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.
న్యుమోనియా ప్రమాదం...
అతిగా మందు తాగడం వల్ల శరీరానికి వ్యాధిని నిరోధించడం కష్టమవుతుందని మాయో క్లినిక్ సంస్థ వివరించింది. అంతేకాకుండా కొవిడ్ లక్షణాల్లో ప్రమాదకరమైన న్యుమోనియా వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు హెచ్చరించింది.