కొందరికి రతిలో ఎక్కువ సమయం పాల్గొనాలని.. ఆ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలని ఉంటుంది. శృంగారం చేయాలనే కోరిక మనసులో ఎంత బలంగా ఉన్నా.. కొన్ని సార్లు సాధ్యం కాదు. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అంగస్తంభన లోపం కూడా అందులో ఒకటి. అంగస్తంభనం నుంచి బయట పడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం!
డాక్టర్‌ను సంప్రదించటం: స్తంభనలోపంతో ఇబ్బంది పడుతున్నా చాలామంది బయటకు చెప్పుకోవటానికి సంకోచిస్తుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లటానికి మొహమాట పడుతుంటారు. ఇది తగదు. ఈ సమస్య కేవలం శృంగారానికి సంబంధించిందే కాదు. గుండెజబ్బు, మధుమేహం వంటి ఇతరత్రా జబ్బులకూ సంకేతం కావొచ్చు. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించి అన్ని విషయాలనూ విడమర్చటం మంచిది. ఏవైనా సమస్యలుంటే ముందే గుర్తించొచ్చు. జీవనశైలి మార్పులతో తగ్గించుకునే మార్గాలనూ తెలుసుకోవచ్చు.
మంచి ఆహారం తినటం: ఒత్తిడి, ఆందోళన, టెస్టోస్టీరాన్ మోతాదులు తగ్గటం వంటి రకరకాల అంశాలు స్తంభనలోపానికి దారితీస్తుంటాయి. అనారోగ్యకరమైన ఆహారం దీని లక్షణాలను మరింత ఎక్కువ చేయొచ్చు. చికిత్సకు త్వరగా లొంగనంతగా ముదిరేలా చేయొచ్చు. అందువల్ల స్తంభనలోపం గలవారు ఆరోగ్యకరమైన ఆహారం మీద ప్రత్యేక దృష్టి సారించాలి. పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు ఎక్కువగా తినాలి. తీపి పానీయాలు, జంక్ ఫుడ్, సంతృప్త కొవ్వు పదార్థాలు తగ్గించాలి. పోషకాలతో నిండిన, తక్కువ కొలెస్ట్రాల్ గల పదార్థాలు సామర్థ్యం పెరగటానికి తోడ్పడతాయి. ఇతరత్రా సమస్యల ముప్పునూ తగ్గిస్తాయి.
వ్యాయామం మరింతగా: వ్యాయామం ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ఇది స్తంభనలోపానికి చికిత్సగానూ పనిచేస్తుంది. వ్యాయామంతో శరీరమంతటికీ రక్త సరఫరా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇవి రెండూ స్తంభన సామర్థ్యాన్ని పెంచేవే. స్తంభనలోపానికి కారణమయ్యే ఊబకాయం, గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలు అదుపులో ఉండటానికీ వ్యాయామం తోడ్పడుతుంది. కాబట్టి నడక, పరుగు, సైకిల్ తొక్కటం, ఈత కొట్టటం, బరువులెత్తటం వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయటం మంచిది. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివీ మేలు చేస్తాయి.
పొగ మానెయ్యటం: పొగ తాగితే గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ల వంటి రకరకాల సమస్యలు చుట్టు ముడతాయి. అంతేనా? ఇది శృంగార సామర్థ్యాన్నీ తగ్గిస్తుంది. ఎందుకంటే పొగ తాగటం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో అంగం స్తంభించకపోవచ్చు. స్తంభించినా ఎక్కువసేపు అలాగే ఉండకపోవచ్చు. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.
మానసిక నిపుణుల సలహా: మానసిక ఒత్తిడితో స్తంభనలోపం తలెత్తటమే కాదు.. ఒత్తిడి సైతం ఈ సమస్యకు కారణమవ్వచ్చు. ఇది మానసికంగానూ ఇబ్బంది పెడుతుంది మరి. ఎంతోమంది దీని గురించి బయటకు చెప్పుకోలేక లోపల్లోపలే మథన పడుతుంటారు. ఇది ఆందోళన, కుంగుబాటుకు దారితీస్తుంది. ఇలాంటి వాటితో సతమతమవుతుంటే మానసిక నిపుణులను సంప్రదించటానికి వెనకాడొద్దు. ఒక మంచి సలహా ఎంతో ఉపశమనం కలిగించొచ్చు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటానికి తోడ్పడొచ్చు. జీవితంలో ఒత్తిడికి కారణమయ్యే అంశాలను ఎదుర్కోవటానికీ ఉపయోగపడొచ్చు. ఇవి మానసిక ఆరోగ్యానికే కాదు, స్తంభనలోపం తగ్గటానికీ తోడ్పడతాయి.
ఇవీ చదవండి: సడన్గా బరువు పెరిగినా, తగ్గినా జాగ్రత్త పడాల్సిందే