కరోనా సోకిన వ్యక్తులు ముందుగా రుచి, వాసన చూసే గుణాల్ని కోల్పోతారని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇందులో వాసన పసిగట్టే లక్షణాన్ని వైరస్ సోకిన మూడో రోజు నుంచే కోల్పోతారని తాజాగా ఓ పరిశోధనలో తేలింది. 103 మంది కొవిడ్-19 బాధితులపై 6 వారాలకు పైగా టెలీఫోనిక్ అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని ధ్రువీకరించారు శాస్త్రవేత్తలు. వైరస్ లక్షణాలు బయటపడని వారిలో కరోనా ఉందో లేదో గుర్తించేందుకు తాజా పరిశోధన ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఓటోలారింగాలజీ-హెడ్ అండ్ నెక్ సర్జరీ జర్నల్లో ప్రచురించారు.
స్విట్జర్లాండ్లోని ఆరావు పట్టణానికి చెందిన 103 మంది కరోనా బాధితులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. వీరిలో కనీసం 61శాతానికి పైగా వాసన చూసే గుణాన్ని కోల్పోయినట్లు జర్నల్ సహ రచయిత అహ్మద్ సెదఘట్ తెలిపారు. కొవిడ్-19 ప్రభావాన్ని బట్టి.. వాసనలేమి తీవ్రత ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. అనోస్మియా (వాసనలేమి) ఎక్కువగా ఉంటే.. శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బంది పడతారని, జర్వం, దగ్గు కూడా అధికంగా ఉంటాయని చెప్పారు సెదఘట్. అయితే అనోస్మియా ఉన్నంత మాత్రాన కరోనా సోకినట్లు నిర్ధరణకు రాలేమని స్పష్టం చేశారు.
" యువకులు, మహిళలు కూడా వాసనలేమికి గురైనట్లు ఈ పరిశోధనలో తేలింది. ఇదొక కీలకమైన అంశం. ఎందుకంటే.. కొవిడ్-19 సోకినవారిలో ముక్కు సంబంధిత సమస్యల లక్షణాలు అరుదుగా ఉంటాయని, అది కూడా అలెర్జీ సోకినప్పుడే వస్తాయని గత అధ్యయనాల్లో కొందరు పేర్కొన్నారు. అలాగే కరోనా సోకినవారు ఇతరులకు వ్యాప్తి చేయకుండా తగిన జాగ్రత్తుల తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది."
- అహ్మద్ సెదఘట్, శాస్త్రవేత్త
ఇదీ చూడండి : లాక్డౌన్లో పెరిగిన పేదల ఆకలి బాధలు