పులిపుర్లు లేదా స్కిన్‌ట్యాగ్స్ ప్రమాదకరమైనవి కావుగానీ చూడ్డానికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి. సాధారణంగా మధ్య వయస్కుల్లో, అధిక బరువు ఉండే వాళ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. పాతికేళ్లు దాటిన తర్వాత ఏ వయసులోనైనా ఇవి రావచ్చు. అలాగే వయసు పెరిగే కొద్దీ వాటి సంఖ్య ఎక్కువ కావచ్చు కూడా. ఒక్కోసారి వాటంతట అవే రాలిపోతుంటాయికానీ చాలావరకూ అలాగే ఉండిపోతాయి.
హార్మోన్లలో హెచ్చుతగ్గులు, జన్యుపరమైన కారణాలవల్ల ఇవి వస్తుంటాయి. ఒక్కోసారి వైరస్‌ల వల్ల కూడా వ్యాపిస్తుంటాయి. ఇవి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించవు. పులిపుర్లు క్యాన్సర్‌గా మారే ప్రమాదముందని కొందరు భయపడుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. వీటిని తొలగించడానికి.. ఫ్రీజింగ్ లేదా క్రయోథెరపీ, కాట్రీషేవింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ, కటింగ్, స్నిప్పింగ్, బర్నింగ్... లాంటి పద్ధతులను ఉపయోగిస్తారు.
మీరు వైద్యులను సంప్రదిస్తే మీకు అనుకూలమైన పద్ధతిలో వీటిని తొలగిస్తారు. సాధారణంగా క్రయోథెరపీ, కాట్రీ షేవింగ్ అనే పద్ధతుల్నే ఎక్కువగా వాడుతుంటారు. ఇవేమీ హానికరమైన పద్ధతులు కాదు. మీరు వైద్యులను సంప్రదించి భయపడకుండా తొలగించుకోవచ్చు.