కరోనా భయంతో బయటి నుంచి ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్ చేస్తున్నాం. ఇంటి పనులతో అలసిపోయినా, ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నా సరే.. ఓపిక తెచ్చుకొని మరీ ఒకటికి రెండుసార్లు శుభ్రం చేస్తున్నాం. ఈ క్రమంలో నెలకు సరిపడా నిత్యావసరాలను మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఒకేసారి శానిటైజ్ చేసి పెట్టుకుంటున్నాం.. అదే కాయగూరలైతే వారానికోసారి తెచ్చుకొని ఉప్పు నీళ్లు, పసుపు నీళ్లతో శుభ్రం చేస్తున్నాం.
ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. ఏ రోజుకారోజు తెచ్చుకునే పాల ప్యాకెట్స్ సంగతేంటి? ‘హా.. వాటిపై ఏముంటుందిలే..’ అంటూ చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. కానీ అలాంటి అలక్ష్యమే వద్దంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. ఈ నేపథ్యంలోనే పాల ప్యాకెట్ కొనడం దగ్గర్నుంచి ప్యాకెట్‌లోని పాలను మరగబెట్టే దాకా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో మనమూ తెలుసుకొని పాటించేద్దాం రండి..
ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా? లేదా? అన్నది నేటికీ తేలని విషయమే. అయినా సరే బయటి ఆహారం కంటే ఇంట్లోనే ఎప్పటికప్పుడు తాజాగా వండుకొని, వేడివేడిగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బయటి నుంచి తెచ్చుకొనే ఫుడ్ ప్యాకెట్స్ విషయంలో మరింత జాగ్రత్తపడమంటున్నారు.
ఎందుకంటే గతంలో జరిపిన పరిశోధనల ప్రకారం.. కరోనా వైరస్ ప్లాస్టిక్‌పై దాదాపు మూడు రోజుల పాటు బతికుండడమే ఇందుకు కారణం. కాబట్టి ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన వస్తువుల్ని ఇంటికి తెచ్చిన వెనువెంటనే శానిటైజ్ చేయాలి. అలాంటి వాటిలో పాల ప్యాకెట్స్ కూడా ఒకటి. ఈ క్రమంలో ప్యాకేజ్డ్ పాలను ఎలా శుభ్రం చేయాలో వివరిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన అధికారిక ట్విట్టర్ పేజీ వేదికగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
‘బయటి నుంచి ఇంటికి తెచ్చిన పాల ప్యాకెట్లను శుభ్రం చేసే క్రమంలో ఈ సులభమైన చిట్కాల్ని పాటించండి..’ అంటూ బొమ్మలతో కూడిన ఐదు చిట్కాలను మన ముందుంచిందీ సంస్థ.
- పాలు అమ్మే వ్యక్తి దగ్గర్నుంచి పాలు తీసుకునే క్రమంలో సామాజిక దూరం పాటించండి. ఈ క్రమంలో సదరు వ్యక్తి మాస్క్ ధరించారో, లేదో చెక్ చేయండి.. ఒకవేళ మాస్క్ పెట్టుకోకపోతే.. ధరించమని వారికి చెప్పండి.
- పాల ప్యాకెట్‌ను కుళాయి నీళ్ల కింద ఉంచి కడగాలి.
- పాల ప్యాకెట్‌ను కడిగిన వెంటనే కట్ చేయడం కాకుండా కాసేపు అలాగే పక్కన పెట్టేయండి. తద్వారా ప్యాకెట్ ఉపరితలంపై ఉన్న నీళ్లు ఆరిపోతాయి. లేదంటే ఆ నీళ్లు కూడా పాలతో పాటే గిన్నెలో పడతాయి.
- ప్యాకెట్‌లోని పాలు పాత్రలో పోయడానికి ముందు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.
- ప్యాకెట్ ఉపరితలం పూర్తిగా ఆరిపోయిన తర్వాత కట్ చేసి.. పాలను పాత్రలో పోసి బాగా మరిగించాలి.
ఇలా చేస్తే మరీ మంచిది!
కొంతమంది పాలమ్మే వ్యక్తి దగ్గర్నుంచి ప్యాకెట్స్‌లో కాకుండా విడిగా పాలు తీసుకుంటుంటారు. అలాంటి వారు మాస్క్ ధరించి సదరు వ్యక్తికి దూరంగా ఉండి పాలు తీసుకోవచ్చు.. అయితే ఈ క్రమంలో ఎవరి గిన్నె వారు తీసుకెళ్లి తెచ్చుకోవడం మరీ మంచిది. ఒకవేళ వాళ్లు ప్యాకెట్స్ రూపంలో సప్లై చేసినట్లయితే మీ ఇంటి ముందు ఒక బుట్టను ఉంచండి.. వాళ్లు ఆ ప్యాకెట్స్‌ని అందులో పెట్టి వెళ్లిపోయాక మీరు తెచ్చేసుకొని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాల ప్రకారం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. తద్వారా సదరు వ్యక్తిని కలవాల్సిన అవసరం కూడా ఉండదు..
ఈ కరోనా సమయంలో ప్యాకెట్ పాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ప్యాకెట్‌ను ఎలా శుభ్రం చేయాలి? తదితర విషయాల గురించి తెలుసుకున్నారుగా! మనమూ వీటిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తపడదాం.. కరోనా మహమ్మారికి దూరంగా ఉందాం..!!