Birth Control Pills Effects : వైవాహిక జీవితంలో పిల్లలు కలగడం అనేది ఒక మధురానుభూతి. పెళ్లైన ప్రతి ఒక్కరూ తమకు సంతానం కావాలనే కోరుకుంటారు. అయితే ఆర్థికంగా సెటిల్ అయ్యాక పిల్లలు పుట్టాలని కొందరు అనుకుంటారు. అప్పుడే పిల్లలు వద్దనుకునేవారు గర్భనిరోధక మాత్రలు లాంటివి వాడుతుంటారు. కాన్పుకు కాన్పుకు మధ్య విరామం కోరుకునేవారూ వీటిని వినియోగిస్తారు. అయితే ఈ మాత్రల్ని తరచూ వాడటం వల్ల భవిష్యత్తులో సంతానం కలగే అవకాశాలు తగ్గుతాయేమోననే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీని గురించి వైద్యులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి అందుబాటులో ఉన్న మార్గాల్లో గర్భనిరోధక మాత్రలు ఒకటి. వీటిని వాడటం వల్ల అవాంఛిత గర్భం రాకుండా సుమారుగా 91 శాతం నిలువరించొచ్చని ‘ఆహార-ఔషధ నిర్వహణ మండలి (ఎఫ్‌డీఏ) చెబుతోంది. అయితే వీటిని వినియోగించే క్రమంలో జాగ్రత్తలు తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇవి వాడటం మంచిదే
Contraceptive Pills Side Effects : ‘పిల్లలు వద్దనుకునేవారు వయస్సు మీరకుండా చూసుకోవాలి. 30 ఏళ్లలోపు వరకు సంతానం వద్దనుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత కూడా కాదనుకుంటే మాత్రం పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంది. గర్భనిరోధక మాత్రలు వాడినంత మాత్రాన ప్రమాదమేమీ ఉండదు. ఈ మాత్రలు వాడటం మంచిది కూడా. కానీ వైద్యుల సలహా మేరకే వీటిని వినియోగించాలి. బీపీ, షుగర్ లాంటి టెస్టులు చేసుకున్న తర్వాతే ఆ మాత్రలను డాక్టర్లు సూచిస్తారు’ అని ప్రముఖ గైనకాలజిస్ట్, డాక్టర్ నర్మద చెప్పారు.
డాక్టర్ల సలహా మేరకు స్త్రీలు తమ ఆరోగ్య స్థితి, ఇతర శారీరక పరిస్థితుల్ని అనుసరించి గర్భనిరోధక మాత్రలను ఎంచుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడేవారు ప్రొజెస్టిన్-ఓన్లీ పిల్స్‌ను ఎంచుకుంటే మేలు అని చెబుతున్నారు. దీని వల్ల అటు బ్లీడింగ్ అదుపులో ఉండటంతో పాటు ఇటు గర్భం రాకుండా నివారించుకోవచ్చని అంటున్నారు.
అపోహలు వద్దు
Side Effects Of birth Control Pills : ‘గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల తల్లికి గానీ, పుట్టబోయే బిడ్డకు గానీ ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. అయితే థైరాయిడ్ లాంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. అవి ఉంటే మాత్రం గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. సాధారణ పరిస్థితుల్లో కొన్నేళ్లపాటు గర్భనిరోధక మాత్రలు వాడొచ్చు. మీకు సరిపోయే మాత్రల్ని వరుసగా ఐదారేళ్ల పాటూ వినియోగించవచ్చు. అయితే అప్పుడప్పుడూ గైనకాలజిస్ట్‌ను కలుస్తూ సలహాలు, సూచనలు తీసుకోవాలి. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు కలగరేమోననే అపోహలు పెట్టుకోవద్దు. వాస్తవానికి చెప్పాలంటే ఇవి వాడి మానేస్తే త్వరగా పిల్లలు పుడతారు’ అని డాక్టర్ నర్మద వ్యాఖ్యానించారు.
వీళ్లు దూరంగా ఉండాలి
Birth Control Pills Pros And Cons : పాలిచ్చే తల్లులు సహజంగానే గర్భం ధరించే ఛాన్సులు తక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటివారు గర్భనిరోధక మాత్రలను ఎంచుకోవాలనుకుంటే.. వారికి మినీ పిల్ బాగా సూటవుతుందని చెబుతున్నారు. ఈ పిల్ వేసుకోవడం వల్ల తల్లిపాల ఉత్పత్తి మీద ప్రభావం పడకుండానూ జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, పలు రకాల క్యాన్సర్లతో ఇబ్బంది పడేవారు.. యాంటీబయాటిక్స్ లేదా మూలికా సంబంధిత మందులు వాడేవారు.. గర్భనిరోధక మాత్రలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.