Early Morning Wake Up Tips : ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేయాలనుకుంటూ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తారు చాలా మంది. కానీ.. తెల్లవారిన తర్వాత పరిస్థితి మారిపోతుంది. అలారం ఆఫ్ చేసి మరీ నిద్రపోతుంటారు! మారిపోయిన జీవన శైలితోనే ఈ సమస్య వస్తోందని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటే.. మేము చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అలారం కూడా అవసరం లేకుండానే ఈజీగా నిద్ర లేస్తారు!
సమయాన్ని సెట్ చేసుకోండి : ఉదయాన్నే నిద్ర లేవాలంటే.. ఒక టైమ్ టేబుల్ అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవాలి. ఆ పడుకునే సమయాన్ని బట్టే.. పొద్దున నిద్ర లేవాలనుకునే టైమ్ నిర్ణయించుకోవాలి. దీన్ని కంటిన్యూ చేయాలి. కొత్తలో సరిగా అమలు కాదు. అయినా కొనసాగించాలి. అప్పుడు ఆటోమేటిగ్గా అలవాటైపోతుంది.
వాటిని దూరంగా ఉంచండి : చాలా మందికి నిద్రపోయే ముందు ఎక్కువసేపు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీ చూసే అలవాటు ఉంటుంది. ఒకవేళ మీకు ఆ హ్యాబిట్ ఉంటే వెంటనే మార్చుకోండి. ఎందుకంటే మొబైల్, ల్యాప్‌టాప్‌ల నుంచి వచ్చే బ్లూలైట్.. మెలటోనిన్ ఉత్పత్తికి అటంకం కలిగిస్తుంది. అది మన నిద్రకు భంగం కలిగిస్తుంది.
అలారం వద్దు : ఉదయాన్నే నిద్ర లేవడానికి ఎక్కువ మంది అలారం పెట్టుకుంటారు. అంటే.. మీరు సమయానికి నిద్రలేవలేరు అని అంగీకరిస్తున్నారన్నమాట! అందుకే అలారం మీద ఆధారపడుతున్నారు! ఇలా ఎవరో ఒకరిపై ఆధారపడే వారు.. సమయానికి నిద్రలేవరు. అలారం పెట్టుకున్నా.. మోగగానే దాన్ని ఆఫ్ చేసి మళ్లీ నిద్రపోతారు. కాబట్టి.. ముందు అలారం బంద్ చేయండి. పైన చెప్పిన విధంగా.. మీ శరీరంలోనే జీవగడియారాన్ని ఏర్పాటు చేసుకోండి.
వాకింగ్‌తో వెయిట్ లాస్- వారంలో ఎన్ని రోజులు, ఎంత సేపు నడవాలి?
తేలికపాటి ఆహారం : చాలా మంది రాత్రిపూట ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటారు. అలాకాకుండా తేలికపాటి భోజనం తీసుకోవడం అలవాటు చేసుకోండి. రాత్రి తేలికపాటి భోజనం తీసుకుంటే.. కడుపు తేలికగా ఉంటుంది. కాబట్టి ఉదయం త్వరగా నిద్రలేవడానికి ఎటువంటి సమస్యా ఉండదు.
టీ, కాఫీలకు దూరం : రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కొందరు టీ, కాఫీ తాగడానికి ఇష్టపడతారు. మీరు హాయిగా నిద్రపోయి వేకువజామున లేవాలంటే.. రాత్రిపూట ఇవి తాగే అలవాటు మానుకోవాలి.
నీళ్లు తాగాలి : డీహైడ్రేషన్ కూడా మార్నింగ్ త్వరగా లేవకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దీని వల్ల మరింత బద్ధకంగా అనిపిస్తుంది. కాబట్టి నిద్ర లేచిన వెంటనే కొన్ని నీళ్లు తాగాలి. ఇది అలవాటుగా మారాలి.
డుమ్మా కొట్టొద్దు : ఉద్యోగస్తులు వీకెండ్ వచ్చిందంటే.. ఇవాళ ఆఫీసు లేదుకదా అని ఎక్కువసేపు పడుకుంటారు. దీనివల్ల మీ సైకిల్ డిస్ట్రబ్ అవుతుంది. అందుకే.. సెలవుతో సంబంధం లేకుండా.. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవాలి. అదే టైమ్ టేబుల్ ఫాలో అవ్వాలి. ఇలా చేసి చూడండి.. తప్పక అనుకున్న సమయానికి నిద్రలేస్తారు.
చలికాలంలో కూడా వేడి చేస్తోందా? కారణాలు ఇవేనట!
Tips For Weight Loss : డైటింగ్ చేస్తే నీరసంగా అనిపిస్తోందా.. ఐతే ఉల్లాసంగా బరువు తగ్గేయండిలా..!