BENEFITS OF CURD: ఆరోగ్యానికి పెరుగు ఉత్తమమైనది. పేగుల్లో ఉపయోగపడే బ్యాక్టీరియాల వైవిధ్యాన్ని కాపాడే ప్రోబయోటిక్ పెరుగులో ఉంటుంది. పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, అందాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది..
జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి. పైగా మనం తీసుకునే ఇతర పదార్థాల నుంచి పోషకాలనూ శరీరం స్వీకరిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
మేలు చేసే బ్యాక్టీరియా..
పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.
క్యాల్షియం ఎక్కువే..
ఇతర పాల పదార్థాల్లానే పెరుగులోనూ క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. పెరుగులో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఇది క్యాల్షియంతో కలవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ పెరుగు తినడం వల్ల భవిష్యత్తులో కీళ్లనొప్పులు, ఆస్టియోపొరోసిస్ లాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి.
ఒత్తిడికి దూరంగా..
కొన్ని సందర్భాల్లో చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కప్పు పెరుగు తిని చూడండి. అది ఒత్తిడిని సులువుగా తగ్గించేస్తుంది. మానసిక సాంత్వనను కూడా అందిస్తుంది. అలాగే బరువు సైతం అదుపులో ఉంటుంది.
- ప్రతిరోజూ పెరుగు తీసుకునే వారిలో గుండె సంబంధిత సమస్యలు చాలామటుకు అదుపులో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది.