ప్రస్తుతం అందరి జీవితాల్లోనూ వేగం పెరిగింది. విద్య, ఉద్యోగం, వ్యాపారం అంటూ అందరూ తమ పనుల్లో బిజీ అయిపోతున్నారు. సరిగ్గా తినడానికి కూడా ఎవరికీ తీరిక ఉండట్లేదు. ఇంకా శారీరక శ్రమ సంగతి సరేసరి. ఇలాంటి జీవనశైలి వల్ల చాలా మంది కొత్త రకం వ్యాధుల బారిన పడుతున్నారు. జీవనశైలి వ్యాధుల్లో ఊబకాయం కూడా ఒకటి. బరువు పెరగడం మంచిది కాదని.. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బరువు పెరిగిన వారు ఎలాగైనా కొవ్వును కరిగించాల్సిందే. అలాగని ఏదిపడితే అది చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. మరి ఈజీగా బరువు తగ్గడానికి వారు చెబుతున్న సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీవనశైలి మార్పుతో సత్ఫలితాలు
బరువు తగ్గాలనుకునే వారికి హార్వర్డ్ విశ్వవిద్యాలయ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఊబకాయం బారి నుంచి బయటపడేందుకు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రోజువారీ జీవితంలో శారీరక శ్రమను ఒక అలవాటుగా చేర్చుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. జిమ్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా నడకతోనూ సత్ఫలితాలను అందుకోవచ్చని హార్వర్డ్ నిపుణులు అంటున్నారు.
నడక తప్పనిసరి
భోజనం చేసిన తర్వాత వెంటనే కునుకు తీయడం చాలా మందికి అలవాటు. కానీ తిన్న వెంటనే నిద్రపోకుండా కాసేపు నడవాలి. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణమవడమే కాకుండా మనసుకు కూడా సాంత్వన లభిస్తుందని హార్వర్డ్ నిపుణులు చెబుతున్నారు. భోజనం అనంతరం 15 నిమిషాల పాటు నడిస్తే రక్తంలోని చక్కెర స్థాయులు తగ్గుతాయట. దీంతో టైప్ 2 మధుమేహం ముప్పు తగ్గుతుందని అంటున్నారు. తిన్న వెంటనే కూర్చోకుండా నడిస్తే కండరాలు ఉత్తేజితమై రక్తంలో అధికంగా ఉండే గ్లూకోజ్ తగ్గుతుందని.. అలాగే శరీరంలో ఇన్సూలిన్ స్థాయులు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
అలా నడిస్తే అదనపు ప్రయోజనం
నడక ప్రయోజనాలు అందాలంటే గంటలకొద్దీ వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు. దీని బదులు కొద్దిసేపే అయినా వేగంగా నడిస్తే మేలు అని నిపుణులు అంటున్నారు. అయితే ఒకేసారి వేగంగా నడవకుండా.. క్రమంగా వేగం పెంచుతూ పోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల కాళ్లపై అధిక భారం కూడా పడదట. ఏటవాలు భాగాల్లో నడవడం వల్ల క్యాలరీలు 13 శాతం అధికంగా ఖర్చవుతాయట. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త దారుల్లో నడుస్తూ, ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో అధికంగా శ్రమిస్తే సరిపోతుందని హార్వర్డ్ నిపుణులు చెబుతున్నారు.
పాదాలపై భారం వేయాలి
బాస్కెట్ బాల్ ఆటగాళ్లను గమనిస్తే వారు సాధన సమయంలో ఎక్కువగా పాదాలపై అధిక భారాన్ని మోపుతారు. ఈ ఆటలో ఆటగాళ్లు ఎక్కువగా పైకి ఎగరాల్సి ఉంటుంది. కాబట్టి కాళ్లు మరింత పటుత్వంగా మారేందుకు అలా చేస్తుంటారు. రోజువారీ చేసే నడకలోనూ ఈ సూత్రాన్ని అనుసరిస్తే ప్రయోజనాలు ఉంటాయని హార్వర్డ్ నిపుణులు అంటున్నారు. కాళ్లపై ఏదో ఒక రూపంలో కాస్త ఎక్కువ భారం పెట్టి నడిస్తే క్యాలరీలు 15 శాతం ఎక్కువగా ఖర్చవుతాయట. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా తర్వాత అలవాటు అయిపోతుంది. బరువు తగ్గేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇంట్లో అవి ఉంచొద్దు
బరువు పెరగకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ చేయడం ఎంత ముఖ్యమో తక్కువ తినడం కూడా అంతే ముఖ్యం. మూడు పూటలు ఆహారం తింటున్నా ఇంకా బాగా ఆకలేస్తోందా? అయితే ఇలా చేయండి. మీకు ఆకలి వేసినప్పుడల్లా బయటికి వెళ్లి 15 నిమిషాల పాటు నడవండి. అలాగే బరువును పెంచే తీపి పదార్థాలతో పాటు నోరూరించే ఆహార పదార్థాలను ఇంట్లో పెట్టకండి. ఇలాంటి పదార్థాలు ఇంట్లో ఉంటే ఆకలి వేయకున్నా తినాలనే కోరిక కలుగుతుంది. వీటి స్థానంలో బాదాం, కాజూ, అంజీర్ లాంటి డ్రై ఫ్రూట్స్‌ను ఇంట్లో ఉంచితే మేలు అని హార్వర్డ్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు. దీని వల్ల శరీరంలో అవసరమైన గ్లూకోజ్ చేరుతుంది. అలాగే ఆకలి కూడా అంత త్వరగా వేయదు.
ఇవీ చదవండి : ప్రెగ్నెన్సీని ఏ తేదీ నుంచి లెక్కించాలి? డాక్టర్లు ఏమంటున్నారు?
కరోనా కాలంలో సెల్‌ఫోన్‌కు చేరువై.. మాటలకు తడబడుతున్న చిన్నారులు