తలనొప్పి... రోజూవారీ జీవితంలో సాధారణమే. కానీ.. కరోనా లక్షణాల్లో తలనొప్పి కూడా ఒకటని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇవి ప్రజల్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే కేవలం 13 శాతం కేసుల్లోనే కొవిడ్ బాధితులు తలనొప్పితో బాధపడుతున్నట్లు న్యూరాలజీ నిపుణులు డాక్డర్ పద్మ వీరపనేని చెబుతున్నారు.
ఇవీ కారణాలు
తలనొప్పి అనేది వైరస్ లక్షణమనే విషయాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. కానీ ఇదివరకే తలనొప్పి ఉన్నవారికి వైరస్ సోకిన తర్వాత ఈ నొప్పి కాస్త అధికమవుతుందని డా.పద్మ చెబుతున్నారు. అందుకు గల కారణాలను వివరించారు.
- ఒత్తిడి
- ఆందోళన
- అధిక జ్వరం(కరోనా లేదా ఇతర కారణాల వల్ల వచ్చినదైనా)
- నిద్ర లేమి
- దినచర్యలో మార్పు
- భోజన సమయం సక్రమంగా లేకపోవడం
- సరైన హైడ్రేషన్ లేకపోవడం
- ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువసేపు ఉపయోగించడం
మరేం చేయాలి?
స్మార్ట్ తెరలకు అతిగా చూడటం వల్ల మైగ్రేన్ తలనొప్పి, క్లస్టర్ తలనొప్పితో పాటు కంటి చూపు సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ పద్మ తెలిపారు. ఈ నేపథ్యంలో తలనొప్పి సమస్యలను నివారించడానికి పలు సూచనలు చేశారు.
- డిజిటల్ స్క్రీన్స్‌ను చూసే సమయం తగ్గించుకోవాలి.
- కొవిడ్-19 సంబంధిత వార్తలు చూడడం కాస్త తగ్గించండి.
- మెడిటేషన్‌తో పాటు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి.
- మద్యం, ఇతర డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.
- సరైన దినచర్య పాటించండి.
- నీళ్లు ఎక్కువగా తాగండి.
- సమయానికి భోజనం తీసుకోండి.
- యోగా, ఇతర శారీరక వ్యాయామాలు చేయండి.
- సరిగా నిద్రించండి.
- మిత్రులు, శ్రేయోభిలాషులతో సంభాషించి.. మీ మనోభావాలను పంచుకోండి.
చివరగా..
తలనొప్పి కొందరిలో సాధారణంగానే ఉంటుంది. ఇలాంటి ఆపత్కాలంలో పైన పేర్కొన్న పలు సూచనలు మీ సమస్యల నుంచి బయట పడేందుకు ఉపయోగపడతాయి. కరోనాపై భారతదేశం పోరాటం సాగిస్తున్న ఈ తరుణంలో పైన ఉదహరించిన మార్గాలను పాటించి తలనొప్పి సమస్యలపై మీరూ పోరాటం చేయండి.