లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్నారా? ఖాళీ సమయాల్లో ఏం చేస్తున్నారు? ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే జుట్టు, చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారా? ఇంట్లో సులభంగా తయారుచేసుకునే కొన్ని పదార్ధాలను గుంటూరు అమృత ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు నిర్మలా దేవి సూచిస్తున్నారు. ఆమె చెప్పిన చిట్కాలు తెలుసుకుందామా?
చర్మానికి సంబంధించిన చిట్కాలు..
- చర్మం మెరుపు కోసం.. వెన్నకు గుడ్ల సొన కలిపి క్రీమ్‌లా తయారు చేయండి. ఈ మిశ్రమంతో మీ ముఖానికి మర్దన చేయాలి. దీని వల్ల మీ ముఖంలో గ్లో వస్తుంది.
- మొటిమలు.. జాజికాయ పొడి, చందనం, మిరియాల పొడి సమపాళ్లలో కలిపాలి. అవసరమైతే మిరియాల పొడిని మితంగా వేసుకోవచ్చు. ఈ మిశ్రమానికి పాలు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇది మీ మొటిమల సమస్యను తొలగిస్తుంది.
- చర్మ సమస్యలు.. ఉసిరికాయ పొడి, వేపాకు పొడికి నెయ్యి కలిపి తాగితే అలర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉసిరికాయ పొడిని బెల్లంతో కలిపి కూడా వాడవచ్చు. అల్లం రసం, బెల్లం మిశ్రమం కూడా ఫలితాన్ని ఇస్తుంది.
- చర్మ వ్యాధులు.. వేప పొడి, హరాడ్ పొడి, ఉసిరికాయ పొడి మిశ్రమాన్ని నెలపాటు తీసుకుంటే అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గేందుకు సహాయపడుతుంది. వేప ఆకులు లేదా ఉసిరికాయ పడిగడుపున తినటం మంచిది.
- ఆయిలీ స్కిన్ కోసం.. కొబ్బరి పాలతో ముఖానికి మర్దన చేయాలి. ఇది మీ ముఖంపై జిడ్డును పోగొడుతుంది.
జుట్టు కోసం చిట్కాలు..
- చుండ్రు సమస్య.. పాలలో గసగసాలు కలిపి ఒక హెయిర్ ప్యాక్ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి కొంత సమయం ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చుండ్రు తొలగిపోతుంది.
- జట్టు నెరవటం.. ముక్కు ద్వారా రెండు చుక్కల ఆవ నూనెను తీసుకోండి. ఇది మీ జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది.
- రింగ్ వామ్.. సల్ఫర్, సెసమీ నూనెను రాయటం వల్ల రింగ్ వామ్ సమస్య తగ్గుతుంది.
- జుట్టు రాలటం.. మందార పూలతో ఆవు మూత్రాన్ని కలిపి వాడటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుంది.
ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోవచ్చని.. వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నిర్మలా దేవి చెబుతున్నారు. సాధారణంగా వచ్చే సమస్యలకు సహజ పద్ధతిలో చికిత్స చేసుకోవాలనుకునే వారికి ఇవి ఉత్తమమైన చిట్కాలని ఆమె అన్నారు.