యాదాద్రి దివ్యక్షేత్రం... పున్నమి చెణుకా..? వెన్నెల తునకా?.. అన్నట్టుగా వెలుగులు విరజిమ్మింది. కొండపైన దీపాల స్వర్ణ కాంతుల్లో వెలుగులీనుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి(Yadadri temple latest news) నూతన ఆలయం... కొండ కింద విద్యుద్దీపాల వెండి వెలుగుల్లో యాదగిరిగుట్ట పట్టణం.. దీపావళి సందర్భంగా చీకటి వేళ ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. రాత్రిపూట కాంతులీనిన గుట్టప్రాంతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. పసిడి వర్ణంలో ప్రధాన ఆలయ పరిసరాలు, మాడవీధులు, రాజ గోపురాలు, ప్రాకార మండపాలూ ధగధగ మెరిసిపోయాయి.
పుష్పాలంకరణ సేవాపర్వం
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి(Yadadri temple latest news) తొలి దర్శనం పేరిట దేవస్థానం పుష్పాలంకరణ సేవాపర్వాన్ని ప్రవేశపెట్టింది. కార్తికమాసం తొలిరోజైన శుక్రవారం నరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి పేరుపైన ఈ కైంకర్య నిర్వహణను ప్రారంభించారు. ఈ సేవాటికెట్ ధరను రూ.300గా నిర్ణయించారు. ఈ టికెట్‌తో ఒకరు మాత్రమే ఉదయం 5.30 నుంచి 6.00 గంటల మధ్య పూల అలంకరణలోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని తొలి దర్శనం చేసుకోవచ్చని ఈవో గీత తెలిపారు. మొదటి టికెట్‌ను ఆలయ పేష్కార్ రమేష్‌బాబు ఖరీదు చేయగా.. తొలి రోజు 19 టికెట్లు విక్రయించారు. కార్తిక మాస ప్రవేశం, స్వామి జన్మనక్షత్రం కలిసి రావడం శుభపరిణామమని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.
చకాచకా పనులు
యాదాద్రి పుణ్య క్షేత్రాభివృద్ధిలో(Yadadri temple latest news) భాగంగా కొండపైకి వచ్చి, పోయే మార్గాల విస్తరణతో సహాపై వంతెనల నిర్మాణం జోరందుకుంది. కొండెక్కి, దిగే కనుమదారులకు రెండు దిక్కులా పైవంతెనలు నిర్మిస్తున్నారు. కొండకు ఉత్తరదిశలో 12మీటర్లు వెడల్పు, 650 మీటర్ల పొడవున కట్టే వంతెనకు రెండో ఘాట్ రోడ్డుకు కలపనున్న వంతెన పిల్లర్‌కు వేయాల్సిన 22 స్లాబుల్లో... 14 పూర్తైనట్లు యాడా అధికారులు తెలిపారు. రూ.143 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వలయదారి ప్రణాళికల్లో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు ఎస్ఈ వసంత్ నాయక్, ఈఈ శంకరయ్య తెలిపారు. పాత కనుమదారి విస్తరణతోపాటు కొండెక్కేందుకు చేపట్టిన పైవంతెన కోసం పిల్లర్ల పనులు వేగవంతం చేశారు.
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం..
యాదాద్రికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతోపాటు ఆహ్లాదాన్ని పంచే విధంగా యాడ చర్యలు చేపట్టింది. యాదాద్రిలోని ప్రధాన గుట్టతోపాటు ప్రెసిడెన్షియల్ సూట్లు, టెంపుల్ సిటీ చుట్టూ ఉన్న గుట్టలకు సహజత్వం ఉట్టిపడేలా ‘గ్రీన్ టెర్రామెష్’ విధానంలో కృత్రిమ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఈ పద్ధతిలో మొదట మెష్‌ను గ్రిల్స్‌తో ఏర్పాటుచేసి ముందుభాగంలో మీటరు మేర ఎర్రమట్టిలో సేంద్రియ ఎరువులు, గడ్డి విత్తనాలు చల్లుతారు. ఆ విత్తనాలు మొలకెత్తి, మొక్కలుగా ఎదిగి ఏడాదంతా పచ్చదనాన్ని పంచుతాయి. ఈ విధానం ద్వారా రూపొందించిన గుట్టలు పటిష్ఠంగానూ ఉంటాయని యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ (వైటీడీఏ) డీఈఈ మణిబాబు తెలిపారు. ప్రధాన ఆలయం చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఈ గుట్టలు కుంభాభిషేకం నాటికి నాటికి పచ్చదనంతో యాదాద్రి దర్శనమివ్వనుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: