Yadadri Brahmotsavalu 2022: యాదాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరోరోజు అట్టహాసంగా కొనసాగాయి. బుధవారం ఉదయం గోవర్దనగిరిధారి అవతారంలో భక్తులకు అభయమిచ్చిన స్వామి వారు.. సాయంత్రం యోగానంద నరసింహస్వామి అలంకారంలో సింహ వాహన సేవపై కొలువుదీరారు. విద్యుద్దీపాలంకరణతో ముస్తాబైన బాలాలయం.. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగిస్తున్నారు.
నయన మనోహరం
వజ్రవైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో యాదాద్రీశుడిని నయనమనోహరంగా అలంకరించిన ఆలయ అర్చకులు.. సింహవాహన సేవపై ఊరేగించారు. వేదమంత్రాలు, పారాయణాలు, మంగళవాయిద్యాల నడుమ బాలాలయంలో సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సింహ వాహనసేవ విశిష్టత తెలియజేశారు.
12న రథోత్సవం
11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 14 న ముగుస్తాయి. నేడు స్వామి వారికి ఎదుర్కోలు, 11 న తిరుకల్యాణం, 12 న రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. బాలాలయ ప్రాంగణం, పరిసరాలలో రాత్రి వేళలో కాంతులు విరజిమ్మేలా విద్యత్ దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొండకింద పట్టణంలో ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. వెలుగులు సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: యూపీ, ఉత్తరాఖండ్‌లో భాజపా జోరు.. పంజాబ్‌లో ఆప్‌కు స్పష్టమైన ఆధిక్యం