ప్రేమ, వాత్సల్య స్వరూపుడైన హనుమంతుని అవతారంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో నిర్వహిస్తున్న వేడుకల్లో ఇవాళ ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై కొలువుదీరారు. నిత్యం ఉదయం, సాయంత్రం వివిధ అలంకారాల్లో దర్శనమిస్తున్న నారసింహుడు... కల్యాణ ఘట్టానికి ముందు బాలాలయంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
జగద్రక్షకుడు శ్రీరాముడి ప్రియబాంధవుడైన హనుమంతుడు... పంచనారసింహుల క్షేత్రంలో ద్వార పాలకుడిగా వ్యవహరిస్తున్నారు. ముందుగా ఆంజనేయుని దర్శనం అనంతరమే... శ్రీ లక్ష్మీ సమేత నృసింహ స్వామివార్ల దర్శనం చేసుకునే ఆచారం నేటికీ కొనసాగుతోంది. అందులో భాగంగానే స్వామి హనుమంత వాహనంపై విహరించారు.
ఇవీ చూడండి: 'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'