లక్ష్మీ పుష్కరిణి
మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే యాత్రికులకు సదుపాయంగా గండిచెరువు వద్ద లక్ష్మీ పుష్కరిణి నిర్మిస్తున్నారు. రూ.11.55 కోట్ల ఖర్చుతో 2.20 ఎకరాల్లో నిర్మిస్తున్న పుష్కరిణిలో ఒకేసారి 2500 మంది భక్తులు పుణ్యస్నానాలు చేయొచ్చు. పురుషులు, మహిళల కోసం వేర్వేరుగా 47 షవర్ బాత్‌రూంలు, దుస్తులు మార్చుకునేందుకు 46 గదులు కడుతున్నారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి.
దీక్షాపరుల మండపం
స్వామి దీక్ష చేపట్టిన భక్తులు బస చేసేందుకు ప్రత్యేక సముదాయాన్ని 1.08 ఎకరాల్లో రూ.8.90 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. 140 మంది పురుషులు, 108 మంది మహిళలు బస చేసేందుకు వీలుగా మండపం ఏర్పాటవుతోంది. భవనం నిర్మాణం 90 శాతం పూర్తయ్యింది.
ప్రత్యేకంగా వ్రత మండపం...
లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో వ్రతాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అన్నవరం తర్వాత పెద్ద సంఖ్యలో ఇక్కడ వ్రతాలు జరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రూ.17.38 కోట్ల ఖర్చుతో 1.33 ఎకరాల ప్రాంగణంలో వ్రత మండపం నిర్మిస్తున్నారు. దీన్ని కొండ కింద గండి చెరువు సమీపంలో మూడో ఘాట్ రోడ్డు దిగువన భాగంలో నిర్మిస్తున్నారు. 80,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ మండపంలో రెండు హాళ్లు ఉంటాయి. వీటిలో ఒకేసారి 500 మంది వ్రతాలు చేసుకోవచ్చని యాడా వైస్ ఛైర్మన్ కిషన్‌రావు తెలిపారు. ఈ పనులను ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో కొబ్బరికాయలను కొట్టడానికి ప్రత్యేక స్థలం ఉంటుంది. భక్తులకు మరుగుదొడ్లు, మంచి నీటిసౌకర్యం, ప్రత్యేక దుకాణ సముదాయం, టికెట్టు కౌంటర్లు, దుస్తులు మార్చుకోవడానికి వసతి కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పునాదులు తీసి పిల్లర్లు నిర్మిస్తున్నారు.
అన్నప్రసాద భవనం
భక్తులకు నిత్యాన్నప్రసాదం అందించేందుకు రూ.8.35 కోట్లతో రెండంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఒకేసారి 720 మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా గ్రౌండ్ ఫ్లోర్‌ను 60 వేల చ.అడుగులు, పైౖ అంతస్తును 95వేల చ.అడుగుల విస్తీర్ణంలో దీనికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం నిర్మాణం బేస్‌మెంట్ దశలో ఉంది.
కల్యాణకట్ట
తలనీలాలు సమర్పించేందుకు 2.20 ఎకరాల స్థలంలో కల్యాణకట్ట నిర్మాణం త్వరలో పూర్తికానుంది. 98,950 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ సముదాయం కోసం రూ.20.25 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళలు తలనీలాలు ఇవ్వవచ్చు. మరుగుదొడ్లు, దుస్తుల మార్పిడికి గదులతో సహా క్లోక్‌రూములు ఇక్కడ ఉంటాయి.
- ఇదీ చదవండి : మాస్క్ ధరించకపోతే రూ.500 జరిమానా: ద.మ.రైల్వే