యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రాభివృద్ధిలో భాగంగా పంచ నారసింహులు కొలువై ఉన్న ప్రధాన ఆలయంలో దర్శన వరుసలకు ఇత్తడి గ్రిల్స్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భక్తులు వరుస క్రమంలో గర్భగుడిలోకి వెళ్లేందుకు తూర్పు దిశలోని త్రితల రాజగోపురం నుంచి గ్రిల్స్ బిగిస్తున్నారు. తొలుత క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి మందిరం ఎదుట నుంచి ఆలయ మహా ముఖ మండపం, గర్భాలయం వరకు పనులు చేపట్టారు. పసిడి వర్ణపు ఆకర్షణీయమైన బారికేడ్లను అమర్చుతున్నారు.
![yadadri lakshmi narasimha swamy temple reconstruction works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-18-yadadri-works-av-ts10134_18122020115736_1812f_1608272856_90.jpg)
ఆలయ కొత్త కనుమదారిలో నీటి నిల్వ కోసం సంప్ నిర్మితమవుతోంది. కొండచుట్టూ పచ్చదనం కోసం డ్రిప్ విధానాన్ని అమలు చేయాలని 'యాడా' నిర్ణయించింది. కొండపైకి వెళ్లే దారిలో 2లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్ నిర్మించి డ్రిప్ విధానానికి వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఈ పనులు యాదాద్రి 2వ ఘాట్ రోడ్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేపు సీఎం సమీక్ష