Outer Ring Road Land Acquisition: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల నుంచి సుమారుగా 156 కిలోమీటర్ల మేర ప్రాంతీయరింగ్ రోడ్డు ఉత్తరభాగాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం భువనగిరి ఆర్డీవో పరిధిలో సుమారు 493 ఎకరాలు రైతులు భూముల్ని కోల్పోనున్నారు. రాయగిరి గ్రామంలోనే 266 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రాయగిరిలో ఇప్పటికే హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి కోసం 58 ఎకరాలు తీసుకున్నారు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట రహదారి విస్తరణ కోసం 13 ఎకరాల సేకరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపురం ప్రాజెక్టు ప్రధాన కాలువల కోసం 115 ఎకరాలు తీసుకున్నారు. తాజాగా ప్రాంతీయ రింగురోడ్డు కోసం రాయగిరి గ్రామంలో 266 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు భూములు కోల్పోయామని.. మరోసారి ప్రభుత్వం తమ భూమిని తీసుకుంటామంటే బతికేది ఎట్లా అని రైతులు ఆవేదన చెందుతున్నారు.
సర్వేలో ఆ మూడు గ్రామాల ఊసేది: ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసిన ప్రాంతీయ రింగురోడ్డు షెడ్యూల్‌లో భువనగిరి ఆర్డీవో పరిధిలో రాయగిరి, భువనగిరి కేసారం, పెంచికల్ పహాడ్, తుక్కాపూర్ , చందుపట్ల , గౌస్ నగర్, యర్రంబెల్లి, నందనం గ్రామాల మీదుగా ప్రాంతీయ రింగు రోడ్డు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 24న జారీ చేసిన భూసేకరణ చేయాల్సిన సర్వే నెంబర్లు జాబితాలో భువనగిరి, చందుపట్ల, నందన గ్రామాల ఊసే లేదు. ఈ మూడు గ్రామాలను తొలగించడం వెనుక పెద్దల భూములు ఉండటమే కారణం అన్నది రైతుల ఆరోపణ.
భువనగిరి పరిధిలోని పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రముఖులకు చెందిన భూములు ఉండటంతోనే ఆయా గ్రామాలను తొలగించారని రైతులు చెబుతున్నారు.పెద్దలు, రాజకీయ నాయకుల భూములు కోల్పోకుండా, పేదలు భూములు కోల్పోయేలా అలైన్‌మెంట్ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. యాదాద్రి ఆలయం అభివృద్ధి చెందడంతో కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగిరి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ గ్రామంలో దాదాపు అందరూ వ్యవసాయం మీదనే జీవనం సాగిస్తున్నారు.
బలవంతంగా లాక్కునే ప్రయత్నం: భూములు కోట్ల రూపాయలు పలికినప్పటికీ.. అమ్ముకోకుండా బతుకుతెరువు కోసం ఉంచుకుంటే.. ప్రభుత్వం ప్రాంతీయ రింగు రోడ్డు కోసం భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే నామమాత్రపు నష్టపరిహారం తో పరిసర ప్రాంతాల్లో కనీసం 100 గజాల భూమిని కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: