ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఓటు హక్కు వజ్రాయుధమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు తప్పని సరిగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఎలక్ట్రానిక్ లేదా మాన్యువల్ పద్ధతిలో ఓటును నమోదు చేసుకోవలన్నారు.
వారి ఓటు శాతం పెంచాం..
ఎన్నికల సమయానికి ఓటర్లు తమ పేరు నమోదులను సరి చూసుకుని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఓటరు నమోదుపై పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఓటర్ నమోదు శాతం భారీగా పెరిగిందన్నారు. మహిళలు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి వారి ఓటు శాతం పెంచామన్నారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ శాతం కూడా గణనీయంగా పెరిగిందన్నారు.
ఓటర్ నమోదు గ్రామాల్లో కంటే పట్టణాల్లో అధిక శాతం నమోదు అయ్యేందుకు విద్యాసంస్థలు, కళాశాలలు కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్, కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఎపిక్ కార్డులను అందజేశారు. జిల్లా అధికారులు, సిబ్బంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ ఖిమ్యా నాయక్, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఎన్నికల సిబ్బంది, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'కరోనా టీకాపై వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు'