భావితరాలకు ఆధ్యాత్మికంగా.. ఆహ్లాదంతో పాటు శుభ ఫలితాలు దక్కేలా యాదాద్రి క్షేత్రాన్నిఅన్ని విధాలా రూపొందించేందుకు 'యాడా' శ్రమిస్తోంది. పంచనారసింహుల ఆలయాన్ని మహాదివ్య క్షేత్రంగా మార్చేందుకు చేపట్టిన పునర్నిర్మాణం పనులు పూర్తి కావొస్తున్న తరుణంలో అత్యంత ప్రాధాన్యం గల అష్టదిక్పాలకుల విగ్రహమూర్తులను పొందుపరిచేందుకు సన్నద్ధమయ్యారు. స్వయంభూ క్షేత్రమైన నరసింహ స్వామి ఆలయ సందర్శన కోసం వచ్చే భక్తులకు మానసికంగా ప్రశాంతతను చేకూర్చే తరహాలో వైష్ణవతత్వాన్ని ప్రస్ఫుటించే రూపాలతో కూడిన కృష్ణశిల విగ్రహాలను ఇప్పటికే బిగించారు.
భక్తిభావాన్ని పెంపొందించే దేవుళ్లతో సహా అష్టలక్ష్మి రూపాలు భక్తజనానికి కనులవిందుగొల్పనున్నాయి. 2.33 ఎకరాల్లో స్వామి సన్నిధి ప్రాకారం, మాడ వీధులతో 4.03 ఎకరాలకు విస్తరించి ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించిన విషయం తెలిసిందే. వివిధ హంగులతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. సీఎం యోచనలో వచ్చే రెండు నెలల్లో ఆలయ ఉద్ఘాటనకు తెరతీయనున్నారు.
నలుదిశలా ఖ్యాతిచెందేలా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు ముందస్తుగా సంప్రదాయ ఏర్పాట్లు చేసేందుకు దేవస్థానం యోచిస్తోంది. దీనిపై సలహా తీసుకునేందుకు యాడా బృందం మరోసారి చినజీయర్ స్వామిని కలవనుంది. ఉద్ఘాటన పర్వంపై జీయర్తో.. ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. ఆలోపు ఆలయ పక్షాన చేపట్టాల్సిన ఏర్పాట్ల కోసం దేవస్థానం శ్రమిస్తోంది.
ఇదీ చూడండి: LORD GANESHA: అష్టదిక్కులలో వ్యాపించిన శిష్టజన రక్షకుడు