యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన గొల్ల మాలకుంట ఎల్లమ్మ... పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. భర్త తిమ్మయ్యతో పాటు కుటుంబ బాధ్యతలు మోస్తూ... తన నలుగురు పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతోంది. తన ఇంటి చెత్తను ఊడ్చేయటమే కాకుండా... వీధుల్లోని చెత్తను తరలించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఎల్లమ్మ డ్రైవింగ్ నేర్చుకుంది.
ఎల్లమ్మ దంపతులు అప్పు చేసి రెండు ఆటోలు కొన్నారు. వాటిని యాదగిరిగుట్ట పురపాలిక పరిధిలోని చెత్త సేకరణ కోసం వినియోగిస్తున్నారు. భర్యాభర్తలు ఇద్దరు వేర్వేరుగా ఆటోలు నడుపుతూ... స్వచ్ఛతలో తాము సైతం అంటున్నారు. ఈ పనిలో వచ్చిన డబ్బులతో జీవనాన్ని సాగిస్తున్నారు.
ఎముకలు కొరికే చలిలో తన గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకు ఎల్లమ్మ తన ఆటోతో వస్తుంది. ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరిస్తుంది. దుర్వాసనను భరిస్తూ... ఆ చెత్తను డంప్యార్డుకు తరలిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే పట్టణంలోని కాలనీల్లో స్వచ్ఛభారత్ ట్రాలీ ఆటో నడుపుతున్న ఎల్లమ్మ స్థానికుల అభినందనలు పొందుతోంది.
ఇదీ చదవండి: భవన నిర్మాణ కూలీ నుంచి.. పద్మశ్రీ గ్రహీతగా!