యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం జానకీరం గ్రామ శివారు బిక్కేరువాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలించొద్దంటూ గ్రామస్థులు వేడుకున్నారు. ఇసుక రీచ్ వద్ద సుమారు 200 మంది ఆందోళన చేపట్టారు. గత కొన్నిరోజులుగా వాగు నుంచి గుత్తేదారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రతిరోజు లారీల్లో ఇసుకను తరలిస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటి తాగు, సాగునీటికి తాము తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని తెలిపారు. తక్షణమే ఇసుక రవాణాను బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ వాగులో ఉన్న జేసీబీలను బయటకు పంపించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇసుకను తోడేందుకు అధికారులు అనుమతులు ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: రేపే నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు... ఏర్పాట్లు పూర్తి