తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేకువ జామున నుంచే ఆలయాల వద్ద భారీగా వరుసలు కట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. వేకువ జామున 3.30 గంటల నుంచి ప్రముఖుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. సుమారు రెండున్నర వేల మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనానికి హాజరైనట్లు తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం 4 గంటల నుంచి భక్తులకు అనుమతి ఇచ్చారు.
తిరుమలలో ఇదే తొలిసారి..
నేటి నుంచి జనవరి 3 వరకు తిరుమలలో భక్తులకు స్వామివారి ఉత్తర దర్శనం కల్పించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులకు టోకెన్లు జారీ చేశారు. 10 రోజుల పాటు స్వామివారి వైకుంఠ దర్శనం కల్పించడం ఇదే తొలిసారి. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో తిరుమలలోని 4 మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు. శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు.
యాదాద్రి.. భద్రాద్రి..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉదయం 6.43 గంటల నుంచి స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలకు భక్తులు పోటెత్తారు. భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. గరుడ వాహనంపై రామయ్య, సీతమ్మ, హనుమంత వాహనంపై లక్ష్మణుడు దర్శనం ఇస్తున్నారు.