యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దొంగరి కార్తీక్, నాగచైతన్య ఇద్దరు స్నేహితులు. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు లేనందున పశువులను మేపటానికి ఊర చెరువు పరిసర ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరికీ ఈత రాకున్నప్పటికీ సరదాగా చెరువులోకి దిగారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల నీట మునిగిపోయారు.
ఇది గమనించిన స్నేహితుడు సందీప్ గ్రామస్థులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకొన్న గ్రామస్థులు హుటాహుటిన చెరువులోకి దిగి వెతుకగా మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.