కరోనా పాజిటివ్ వరుస కేసులతో.. యాదాద్రి భువనగిరి జిల్లా బెంబేలెత్తుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో 80కి పైగా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకుంటోంది. వలస కార్మికులు స్వస్థలాలకు చెరుకున్న వారం రోజుల్లోనే యాదాద్రిలో కేసులు రెట్టింపయ్యాయి. దాదాపు 45 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. అందులో 37 మంది వలసకూలీలు కాగా.. మిగిలిన వారు వారి బంధువులు, స్థానికులని అధికారులు చెబుతున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో 7 చెక్ పోస్టులు
జనతా కర్ఫ్యూ నాటి నుంచి యాదాద్రి జిల్లాలో.. కొవిడ్ నివారణకు కఠిన చర్యలను యంత్రాంగం అమలు చేస్తోంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు పరిశీలన చేపట్టింది. జీహెచ్ఎంసీకి ఆనుకుని ఉండటం వల్ల.. ఉపద్రవం రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
భువనగిరి ఖిల్లాను తాకిన కరోనా..
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై అధికారులు నిత్యం నిఘా ఉంచారు. అలా 50 రోజుల పాటు నిరాటంకంగా నెట్టుకొచ్చినా.. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు తిరుగుబాట పట్టిన వారితో భువనగిరి జిల్లాను కరోనా తాకింది. అయితే వలస కూలీల్లో అత్యధికులు సొంత ప్రాంతాలకు రాక ముందే హైదరాబాద్లో పరీక్షలు చేయించుకోవడం వల్ల క్వారంటైన్ తరలించారు. ఫలితంగా జిల్లాకు పెను ముప్పు తప్పింది.
తొలి కేసు నమోదు:
యాదాద్రిలో స్థానిక వ్యక్తికి గత నెల 30న లక్షణాలు బయట పడ్డాయి. తొలి కేసు నమోదుతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇక అపట్నుంచి వరుస కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 5 కేసులు నమోదయ్యాయి.. అయితే ప్రాథమిక కాంటాక్టు ఎక్కడ ఉన్నది అంతు చిక్కడం లేదు. ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో కేసులు నమోదవుతుంటే అధికారులు హడలిపోతున్నారు.
ఎక్కడ సోకినా.. మూలాలు మహానగరంలోనే
- జంటనగరాలకు అత్యంత దగ్గరగా ఉండటం వల్లే వైరస్ వ్యాప్తి విస్తరిస్తోందని జిల్లా అధికారులు అభిప్రాయపడుతున్నారు.
- జిల్లా ప్రజలు ప్రతి చిన్న జబ్బుకు హైదరాబాద్ ఆస్పత్రులను ఆశ్రయించడం మరో కారణం.
వైరస్ గుర్తించిన వ్యక్తులు
- రాష్ట్ర రాజధాని నుంచి గుట్టకు రాకపోకలు సాగించే ఇద్దరు కానిస్టేబుళ్లు
- హైదరాబాద్ నుంచి కూరగాయలు తెచ్చి అమ్మే చౌటుప్పల్ వ్యాపారి, ఆయన కుటుంబంలో మొత్తం ముగ్గురు.
- హైదరాబాద్, దిల్లీ నుంచి వచ్చిన మరో ఇద్దరు
- అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం భాగ్యనగరానికి వెళ్లిన ముగ్గురు మహిళలు
- యాదాద్రిలో మే 30 నుంచి జూన్ 8వ తేదీ వరకు 11మందిలో కొవిడ్ నిర్ధారణ
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 150 దాటింది. ఇందులో సూర్యాపేట జిల్లాలో 85 మంది ఉండగా.. నల్గొండ జిల్లాలో 17 మంది జిల్లా వాసులతోపాటు ఇంకో 10 మంది వలస కార్మికులు. యాదాద్రి జిల్లాలో 11 మంది స్థానికులతో పాటు 37 మంది వలస కూలీలు కొవిడ్ బారిన పడ్డారు.
ఇదీ చూడండి: తీవ్ర ఉత్కంఠ.. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూపు