యాదాద్రి భువనగిరి రాజాపేట మండలంలోని గోపాల్ చెరువులో గంగపుత్ర సంఘం సభ్యులు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విస్తారంగా వర్షాలు కురిసి మండలంలోని చెరువులన్నీ నిండి అలుగుపారడం వల్ల ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు.
గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో సాంప్రదాయబద్ధంగా గ్రామంలో ప్రదర్శన చేపట్టారు. సుమారు నాలుగైదు గంటల పాటు ఊరేగింపు నిర్వహించారు. తెప్ప పీఠానికి మహిళలు ప్రత్యేక స్వాగతం పలికి పూజలు చేశారు.
ప్రత్యేకంగా తయారు చేసిన పీఠాన్ని తలపై పెట్టుకొని బోనాలతో, చెరువు వద్దకు వెళ్లారు. కట్ట మైసమ్మకు నైవేద్యం సమర్పించి, సాంప్రదాయబద్ధంగాా వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
చెరువు వద్ద గ్రామస్థులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ వేడుకలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గౌటె లక్ష్మణ్, సర్పంచ్, గ్రామస్థులు పాల్గొన్నారు.