ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రోజున యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరతారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించడంతో పాటు.... యాదాద్రి పునఃప్రారంభ తేదీలు ప్రకటించే అవకాశముంది. మహాసుదర్శన యాగం వివరాలూ వెల్లడిస్తారని సమాచారం.
ఇటీవలే త్రిదండి చినజీయర్ స్వామిని సీఎం కేసీఆర్ కలిశారు. ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి సతీమణి శోభ, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన ఆయన.... యాదాద్రి నూతన ఆలయం ప్రారంభంపై చర్చించారు. ఆ తేదీలు, ముహూర్తం, వివరాలను యాదాద్రి వేదికగా సీఎం కేసీఆర్ రేపు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆలయ పున:ప్రారంభం సందర్భంగా మహాసుదర్శన యాగం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారు. యాగం తేదీలు, వివరాలను కూడా సీఎం వెల్లడించే అవకాశం ఉంది.
అప్పుడే ఉద్ఘాటన..
మరోవైపు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నవంబరు లేదా డిసెంబరు తొలి వారంలో పంచ నారసింహుల ఆలయ ఉద్ఘాటన చేపట్టనున్న నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న కట్టడాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. సరికొత్తగా పడమటి దిశలోని ఆలయ రక్షణ గోడకు ఏర్పాటవుతున్న జైపుర్‌కు చెందిన ఐరావతం, స్వామి రథశాల కళాకృతులను భక్తులు సందర్శించేలా పోర్టీకో, మెట్ల దారి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ క్రమంలో బండరాతిని తొలగించే పనులను ఆదివారం చేపట్టారు.
మినీ పార్కింగ్ ఏర్పాట్లు..
క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికుల కొండపైకి వెళ్లే ఆలయ పాత కనుమదారిని విస్తరించే పనులు చేపడుతున్నారు. గతంలో హరిత అతిథి గృహ సముదాయం నుంచి కొండపైకి, ప్రస్తుతం జీయర్ కుటీరం వద్ద గల మలుపు నుంచి దారి విస్తరించే పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఆ దారిలోని మినీ పార్కునూ తొలగిస్తున్నారు. రూ.143 కోట్ల వ్యయంతో చేపట్టిన వలయ దారి నిర్మాణంలో భాగంగా ఈ విస్తరణ పనులు జరుగుతున్నాయి. కొండపైన విస్తరణకు రెండో దశలో చేపట్టిన పనులను ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా రావొచ్చని యాడా అధికారులు భావిస్తున్నారు. ఉత్తరాన రూ.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రక్షణ గోడ పూర్తి కావొస్తోంది. ఈ గోడ నిర్మాణంతో కొండపై ఐదెకరాల ప్రాంగణం చదునుగా మారి విస్తరణ కానుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడే బస్‌బే, వాహనాల కోసం మినీ పార్కింగ్ ఏర్పాట్లు జరగనున్నాయి.