CM KCR to Visit Yadadri Temple : యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి సమయం ఆసన్నమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు నిర్వహించే శ్రీలక్ష్మీనారసింహుల కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి కేసీఆర్.. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.
ఈనెల 28వ తేదీన ప్రధానాలయం పునఃప్రారంభ నేపథ్యంలో కొనసాగుతున్న పనులు, మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం యాగాలు,హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై సీఎం కేసీఆర్ ఆరా తీయనున్నారు. దీంతో ఇప్పటికే సీఎం పర్యటన సంబంధించి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం పర్యటనకు అదనపు సీపీ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
బుధవారం.. ప్రగతిభవన్‌లో యాడా, ఆలయ నిర్వాహకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఆలయ పునర్నిర్మాణ పనులు, పునఃప్రారంభ ఏర్పాట్లు, ఆలయ ఉద్ఘాటన పర్వంలో చేపట్టనున్న పంచకుండాత్మక హోమం, మహాకుంభ సంప్రోక్షణ పర్వాలపై చర్చించారు. యాదాద్రిలో మార్చి 21 నుంచి మహాసుదర్శన యాగం నిర్వహించనుండగా.. 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మహాసుదర్శన యాగ స్థలం, అన్నదానం కాంప్లెక్స్, సత్యనారాయణ వ్రతాలు, దీక్షాపరుల మండపాలు, బస్టాండ్ పనులను సీఎం పరిశీలించనున్నారు. పుష్కరిణి వద్ద స్నానపు గదుల నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.