దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మాసపుత్రిక యాదాద్రి భువనగిరి జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాల (Sarvail Gurukulam School) 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటోంది. గురుపూజోత్సవం (Teachers Day) సందర్భంగా సర్వేల్ గురుకులంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు వంద మంది ఉపాధ్యాయులను సన్మానించారు.
భారతదేశంలోని తొలి గురుకులంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలోని ఈ గురుకులం ప్రసిద్ధిగాంచింది. మద్ది నారాయణరెడ్డి 60 ఎకరాల భూదానంతో ఇక్కడ ఈ గురుకుల పాఠశాలను 1971 నవంబర్ 23న పీవీ నరసింహారావు సర్వేల్ గురుకులాన్ని ప్రారంభించారు. 1971 నుంచి ఇప్పటి వరకు 3,500 మంది మేధావులైన విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఈ గురుకులానిది.
సర్వేల్ గురుకులం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు తమ ఉన్నతికి తోడుపడ్డ ఉపాధ్యాయులందరినీ సన్మానించాలని సంకల్పించారు. గురుపూజోత్సవం సందర్భంగా ఈరోజు సర్వేల్ గురుకులంలో వారిని ఘనంగా సన్మానించారు. నవంబర్‌లో సర్వేల్ గురుకులం గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని పూర్వ విద్యార్థులు వెల్లడించారు.
మేము ఈ సంవత్సరం సర్వేల్ గురుకులం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ గురుకులానికి ఒక చరిత్ర ఉంది. సర్వేల్ గురుకులం భారతదేశంలోనే ప్రభుత్వ ఆధీనంలోని మొదటి గురుకులం. 1971లో ఈ గురుకులాన్ని మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రారంభించారు. ఈరోజు గురుపూజోత్సవం సందర్భంగా 1971 నుంచి పనిచేసిన ఉపాధ్యాయులందరినీ సన్మానించాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం.
-- రాజశేఖర్ రెడ్డి, పూర్వ విద్యార్థి సంఘం నాయకులు
ఇదీ చూడండి: Teachers Day: 'బతుకు నేర్పేది... భవిష్యత్‌కు పునాది వేసేది గురువులు'