Architect Usha Raghuveerreddy: ఇప్పుడు భువనగిరి కలెక్టరేట్ భవనాన్ని నిర్మించిన చోటే నేను పుట్టా. మా నాన్న క్వార్టర్స్ ఇక్కడే ఉండేవి. మా సొంతూరు భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామం. నాన్న లక్ష్మీనర్సింహారెడ్డి ప్రజాపనుల శాఖలో సీఈగా పదవీవిరమణ చేశారు. తర్వాత రైల్వేశాఖలో సలహాదారుగా చేశారు. మేం నలుగురం అక్కాచెల్లెళ్లం, ఒక తమ్ముడు. నేనే పెద్దదాన్ని. ఆడపిల్లలని మాపై ఎప్పుడూ ఏ విషయంలోనూ ఆంక్షల్లేవు. 1961లోనే నేను, చెల్లెళ్లూ డార్జిలింగ్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేశాం. అప్పటికి మా కుటుంబంలో అంతా ఇంజినీర్లే. నాకేమో డాక్టర్ కావాలని. నాన్నకు చెబితే ఆర్కిటెక్చర్ చదమన్నారు. అలా హైదరాబాద్ జేఎన్‌టీయూ ఫైన్‌ఆర్ట్స్ కళాశాలలో ఆర్కిటెక్చర్ చదివా. 50 మంది అబ్బాయిల మధ్య... ముగ్గురు ఆడపిల్లలం ఉండే వాళ్లం. రెండేళ్లు చదివాక పెళ్లై అమెరికా వెళ్లాల్సివచ్చింది. దాంతో అక్కడే మిగతా చదువు పూర్తిచేసి, కెరియర్‌ని మొదలుపెట్టా. మావారు రఘువీర్‌రెడ్డి అమెరికాలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా చేసేవారు. నేనూ అక్కడ 15 ఏళ్లు ఆర్కిటెక్ట్‌గా చేశా. కొన్ని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు కూడా చేశా. ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్ దగ్గర సరస్సు పునరుద్ధరణ, మిల్‌వాకీ దగ్గర... బస్‌స్టేషన్లు, ఫెసిలిటీస్ భవనాల ప్రాజెక్టులు సంతృప్తినిచ్చాయి. 1986లో హైదరాబాద్ వచ్చేశాం. అప్పుడే ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 2002లో కొత్తగా మహిళా సమాఖ్య భవనాలు కడుతున్నారు. అప్పటి సెర్ప్ కమిషనర్ శాంతికుమారి అవకాశం ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా 9 భవనాలకు ఆర్కిటెక్ట్‌గా పనిచేశాను. ‘భవనాల శైలి చాలా బాగుంద’ని అప్పటి సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆ తర్వాత నేను చేసినవన్నీ ప్రైవేట్ ప్రాజెక్టులే అయినా వేటికవే సవాల్ అనిపించేవి.
సామాన్యులకూ నచ్చేలా....
2016లో ఒక రోజు శాంతికుమారి సీఎం కేసీఆర్‌ని కలవమన్నారు. వెళ్లాక సీఎం కొత్త కలెక్టరేట్‌ల గురించి చెబుతూ ఒక మాటన్నారు. ‘ఓ మారుమూల పల్లెనుంచి వచ్చిన సామాన్యుడు... ఇంటికెళ్లి ‘కలెక్టరేట్ చూసొచ్చా అని గొప్పగా చెప్పుకోవాలి’అన్నారు. ఈ మాటకి ప్రాణం పొయ్యడం కోసం, భవన శైలిలో తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించేలా చేయడం కోసం ఆరు నెలలు కసరత్తు చేశా. పల్లెలూ, దొరల గడీలు అన్నీ తిరిగి చూశా. కేరళలో లారీబ్రేకర్ అనే ఆర్కిటెక్ట్ స్థానిక సంప్రదాయ శైలి చెడకుండా ఆధునిక భవనాలు నిర్మించేవారు. అది నాకు స్ఫూర్తి. లైట్లు, ఏసీల అవసరం లేకుండా భవనంలో ఎక్కడున్నా నిర్మలమైన ఆకాశం కనిపిస్తూ, గాలీవెలుతురు అందేలా డిజైనింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చాను. నేను రూపొందించిన నాలుగైదు డిజైన్స్‌లో ఒకటి సీఎంకు బాగా నచ్చింది. ప్రస్తుతం ఆరు కలెక్టరేట్‌లు ప్రారంభం అయ్యాయి. ప్రారంభ సమావేశంలో సీఏం ‘ఈ కలెక్టరేట్ సముదాయాలు తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి ప్రతీకలుగా ఉన్నాయి’ అన్నప్పుడు సంతోషంగా అనిపించింది.
రాజీపడను...
మా పనిలో ఇంజినీర్లు, మేస్త్రీలు అంతా మగవాళ్లే. వాళ్లు నా మాట వినాలని లేదు. కానీ డిజైన్ అనుకున్న విధంగా వచ్చేలా చేయడంలో డిక్టేటర్‌ని. ఆ విషయంలో రాజీపడను. చాలాసార్లు మేస్త్రీలు, ఇంజినీర్లు వెళ్లి యజమానితో ‘మేమలా డిజైన్ చేయమనో, మేమా రంగులు వేయలేమనో...’ చెబుతారు. యజమానికి నామీద నమ్మకం ఉన్నంతవరకూ ఇలాంటి ఫిర్యాదులు నన్నేమీ చేయలేవు. ఇక వయసంటారా? నా వయసు 72. కానీ అవకాశాలు దొరికితే వయసుతో పనేంటి? ఎంతటి పనైనా ఉత్సాహంగా చేసేస్తా.
- జీడిపల్లి దత్తురెడ్డి, నల్గొండ
ఇదీ చూడండి: తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కలెక్టరేట్లు.. ఆర్కిటెక్‌కు కేసీఆర్ ప్రశంసలు